సూర్యాపేట జిల్లా:తన తప్పుడు నివేదిక ద్వారా వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులను కూడా తప్పుదోవ పట్టించిన వక్ఫ్ బోర్డు ఇన్స్ స్పెక్టర్ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండీ.అజీజ్ పాషా,ఎస్కె.
జానీ నవాబ్ డిమాండ్ చేశారు.శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఉస్మానియా మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన ముస్లింల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణములోని ఉస్మానియా మస్జిద్ పాత కాంప్లెక్స్ లోని 9వ నెంబర్ షాప్ ఎలాట్మెంట్ రద్దు చేయాలని,9వ నెంబర్ షాపు ఎలాట్మెంట్ విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.నోటిఫికేషన్ లేకుండా షాపును ఇతరులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
హుజూర్ నగర్ కేంద్రంలోని ఉస్మానియా మస్జిద్ వక్ఫ్ పాత షాపింగ్ కాంప్లెక్స్ లోని 9వ నెంబర్ షాపుకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎలాట్మెంట్ జారీ చేయటంలో లక్షల రూపాయలు చేతులు మారాయని, ఈ అలాట్మెంట్ దారుని వద్ద కొంతమంది క్షేత్రస్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు లంచాలు స్వీకరించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులకు తప్పుడు నివేదికలను సమర్పించి వారిని తప్పుదోవ పట్టించి, వక్ఫ్ బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయించారని ఆరోపించారు.మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీకి,స్థానిక ముస్లింలకు తెలియజేయకుండా మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఎలాట్మెంట్ జారీ చేయడంలో అంతర్యం ఏమిటో వక్ఫ్ బోర్డు అధికారులు ముస్లిం ప్రజలకు తెలియపరచాలన్నారు.28 సంవత్సరాలుగా ఈ కాంప్లెక్స్ నందు అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని,ఐక్య కార్యాచరణ పోరాటాలు చేస్తుంటే మరలా కొంతమంది క్షేత్ర స్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు వక్ఫ్ బోర్డ్ నియమాలకు విరుద్ధంగా అలాట్మెంట్ లకు కారణమై,కొత్త వివాదాలను సృష్టిస్తున్నారని ఇలాంటి లంచగొండి వక్ఫ్ బోర్డు అధికారులను సస్పెండ్ చేసి,వక్ఫ్ బోర్డు ప్రక్షాళన చేయాలని కోరారు.అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉన్నట్లయితే వారికి అండగా ఉంటామని,తప్పుడు నివేదికలకు పాల్పడితే హుజూర్ నగర్ ముస్లిం సోదరులు చూస్తూ ఊరుకోరని ఈ షాపు రద్దుచేసే వరకు అనేక పోరాటాలు చేస్తామని, ముస్లిం సోదరులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.వక్ఫ్ బోర్డు ఉన్నతస్థాయి అధికారులు ఇట్టి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.9వ నెంబర్ షాపు కేటాయింపుల్లో జరిగిన కుంభకోణంపై రాష్ట్రస్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి, అవకతవకలకు పాల్పడ్డ వక్ఫ్ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని,షాపు నెంబర్ 9 పై జారీచేసిన అలాట్మెంట్ తక్షణమే రద్దు చేయాలని,వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ జరిపి,అర్హులైన ముస్లిం సోదరులకు షాపు కేటాయింపు జరపాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం షేక్ సైదా మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ వక్ఫ్ బోర్డు ఆదేశాలున్నాయని,ఈ ఆదేశాలు తెలిసి మరీ ఇచ్చినట్లుగా ఉన్నాయని,2022 జనవరి 31వరకు ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 9 ప్రతి నెలా నెలకు 10,000 చెల్లిస్తున్న షాపును,మస్జీద్ కమిటీకి తెలియకుండా మస్జీద్ కమిటీ వారి విజ్ఞాపనను పక్కన పెట్టి మరీ వక్ఫ్ బోర్డు రూ.5000 లకు కిరాయి అంటూ ఆర్డర్ జారీ చేయడంలో మతలబు ఏమిటో ఉన్నతాధికారులు చెప్పాలన్నారు.ఉన్నతాధికారులు స్పందించి వక్ఫ్ బోర్డు ప్రక్షాళనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు బిక్కన్ సాహెబ్,కారు మీరా,మన్సూర్ అలీ,బషీర్, లైటింగ్ జాని,జానీ భాయ్,డ్రైవర్ ముస్తఫా,ఇబ్రహీం, భాషా,రషీద్,నయీమ్,రసూల్,నాగులు,మజీద్, మొయిన్,సలీం,గౌస్,పాహిల్వాన్ తదితరులు పాల్గొన్నారు.