సూర్యాపేట జిల్లాలో తెరపైకి రేపాల కొత్త మండల డిమాండ్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో మరో నూతన మండల డిమాండ్ తెరపైకి వచ్చింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలంలో రేపాల కేంద్రంగా రూరల్ మండలం ఏర్పాటు చేయాలని ఆదివారం రేపాల గ్రామ పంచాయితీ కార్యాలయంలో రేపాల మండల సాధన సమితి అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

 Demand For Repala Should Be Declared As A Mandal, Repala , Mandal, Repala Mandal-TeluguStop.com

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గంట సోమన్న మాట్లడుతూ మునగాల మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీలు ఉన్నాయని,అందులో 11 గ్రామ పంచాయితీలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద ఉండగా,మరో 11 గ్రామ పంచాయితీలు నాన్ కెనాల్ కింద అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి నేటి వరకు అతివృష్టి,అనావృష్టి కారణంగా కరువు వచ్చినప్పుడల్లా మునగాల మండలాన్ని కెనాల్ ప్రాంతంగా భావించిన ప్రభుత్వాలు కరవు మండలంగా ప్రకటించక ఈ 11 గ్రామ పంచాయితీల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా సాగునీటి సౌకర్యం కల్పించక ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారిందని,అనేకమంది రైతులు గ్రామాలను విడిచి పట్టణాలకు వలస పోతున్నారని,ఉన్న కొద్దిమంది చిన్నసన్నకారు, కౌలు రైతులు బోర్లు, బావులు, చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసినా భూగర్భ జలాలు అడుగంటి,సరిపడా పంటపొలాలకు నీరందక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారన్నారు.ఈ ప్రాంతంలో ఉన్న మాధవరం చెరువును రిజర్వాయర్ గా మారిస్తే ఈ ప్రాంత ప్రజలకు సాగు,తాగు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు.

కానీ,గత 75 ఏళ్లుగా ఈ ప్రాంతంపై ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని, అందుకే అన్ని రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయిందన్నారు.

అలాగే మునగాల మండల కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 15 నుండి కి.మి.వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,రవాణా వ్యవస్థ సరిగా లేక విద్యార్థులు, ప్రజలు అవస్థలు పడుతున్నారని,65 వ జాతీయ రహదారిపై మొద్దుల చెరువు నుండి ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిని కలిపి మోతె మండలం వరకు డబుల్ రోడ్డు ప్రతిపాదనలు వచ్చినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని,దీనితో నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ సింగిల్ రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతో రేపాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,పశువుల ఆసుపత్రి,కెనరా బ్యాంకు మీ సేవ,రైతు వేదిక, విద్యుత్ సబ్ స్టేషన్ హై స్కూల్,హాస్టల్ సంబధిత ఉద్యోగుల,రైతువారి, వ్యాపార రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అయినా ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు.

జిల్లాలో అనేక నూతన మండలాల ఏర్పాటులో భాగంగా రేపాలను కూడా మండలంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా దీనిపై అడుగేవారు లేక వెనుకబడి పోయిందన్నారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మునగాల మండలాన్ని రెండు క్లస్టర్స్ గా విడగొట్టిందని మండలంలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకటి మునగాలలో రెండోది రేపాలలో ఉన్నదని, మునగాల పి హెచ్ సి కింద కెనాల్ కింద ఉన్న నర్సింహపురం,కోదండరామపురం,ఆకుపాముల,ముకుందాపురం,బరాఖత్ గూడెం,కృష్ణానగర్,నారాయణగూడెం,మునగాల,గణపవరం,తమ్మారెడ్డిగూడెం,కొక్కిరేణి 11 గ్రామ పంచాయితీలను,రేపాల పిహెచ్ సి పరిధిలో నాన్ కెనాల్ కింద ఉన్న నర్సింహులగూడెం,జగన్నాథపురం,రేపాల, సీతానగరం,విజయరాఘవాపురం,కలకోవ,తాడ్వాయి,వెంకటరామాపురం, నేలమర్రి,ఈదులవాగు తండా,మాధవరం గ్రామ పంచాయితీల హెల్త్ క్లస్టర్ గా ఉన్నాయని తెలిపారు.

రేపాల కింద 11 గ్రామాలు ఆరోగ్య,బ్యాంక్ ఇతరత్రా సేవల కోసం రేపాలకు రావాల్సి ఉంటుందని, తిరిగి మండల పనుల కోసం మునగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఇది మరింత భారంగా మారిందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు,ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి,రేపాల కేంద్రంగా 11 నాన్ కెనాల్ గ్రామ పంచాయితీలను కలుపుతూ కొత్త మండల ఏర్పాటు కృషి చేయాలని కోరారు.

రేపాల మండలం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని లేదంటే ఇంకా వెనుకబడి పోతుందన్నారు.నాన్ కెనాల్ కింద ఉన్న ఈ 11 గ్రామాల ప్రజా ప్రతినిధులు,మేధావులు,యువకులు జరగబోయే రేపాల మండల సాధనలో పేద ఎత్తున కలిసి రావాలని,మండలం ఏర్పడే వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

రేపాల సర్పంచ్ పల్లి రమణా వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పల్లి ఆదిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అద్యక్షుడు వరికల రమేష్, మొగిలిచర్ల సత్యనారాయణ,రిటైర్డ్ ఉద్యోగి బెజవాడ సీతారాములు,రేపాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య,మాజీ చైర్మన్ పోనుగోటి రంగా, సామాజిక కార్యకర్త పెరెల్లి బాబు,వార్డు మెంబర్ బత్తుల నర్సయ్య,గ్రామ పెద్దలు జిల్లపెల్లి వీరాస్వామి,కుంటిగొర్ల వెంకటేశ్వర్లు,గండు వీరబాబు,గండు సత్యనారాయణ,కందిబండ సురేష్,రిపోర్టర్స్ కందిబండ హరీష్,తోకల సైదులు,పాముల రాఘవేందర్,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube