సూర్యాపేట జిల్లా:గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే గీత కార్మికులు ప్రమాదాల నుండి రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ శిక్షణ తీసుకోవాల్సిందేనని కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు అన్నారు.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామంలోని తాటి వనంలో బుధవారం గీత కార్మికులకు ఇచ్చిన కాటమయ్య రక్షణ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి గాయాలు, అంగవైకల్యం కాకుండా, మృతి చెందకుండా నివారించేందుకు కాటమయ్య రక్షణ కిట్టు ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ గీత కార్మికులకు ఎంతో ఉపయోగకరమైందని,దీనిని ఉపయోగించుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని,ఈ రక్షణ కిట్టు ఉపయోగించుకోకుండా తాటిచెట్టు ఎక్కి కింద పడితే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వదని, అందుకని రక్షణ కిట్టు ప్రతి గీత కార్మికుడు ఉపయోగించుకొనే విధంగా శిక్షణ తీసుకుని రక్షణ పొందాలని సూచించారు.
అబ్బిరెడ్డిగూడెం తాటి వనంలో 45 మంది గీత కార్మికులకు 5 గురు ట్రైనర్లు ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మండవ సైదులు,బొల్లెపల్లి శ్రీనివాస్,ట్రైనర్లు జేరిపోతుల కృష్ణ, నోముల వెంకన్న,ఆకుల రమేష్,పలస మధు, పెంటగాని హరీష్,వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు,ఎక్సైజ్ ఎస్ఐ గండమల్ల వెన్నెల, ఎస్.నాగయ్య,మండవ లక్ష్మీప్రసన్న,బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు సైదులు తదితరులు పాల్గొన్నారు.