సూర్యాపేట జిల్లా: కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో మొండి చెయ్యి చూపించిందని అవాజ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.50 లక్షల కోట్ల బడ్జెట్లో మైనార్టీలకి కేవలం 3350 కోట్లు కేటాయించడం చాలా అన్యాయమని, అందులో కూడా గతంలో కేటాయించిన వాటికంటే పెద్ద ఎత్తున కోతలు విధించారని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో 700 కోట్ల రూపాయల కోత విధించిందని,ఒకవైపు వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేస్తామని చెప్తూనే,రెండోవైపు వక్ఫ్ బడ్జెట్లో కోతలు విధించిందన్నారు.మైనార్టీ విద్యకు బడ్జెట్లో 900 కోట్ల రూపాయల కోత విధించిందని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోతలు విధించి మైనార్టీ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.
రాష్ట్రాల్లోని మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు నిధులు సమకూర్చి,మైనారిటీ యువతకి,చిన్న వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందజేయాల్సిన నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపులే లేవని వాపోయారు.
కేంద్ర ప్రభుత్వ స్కీములకు సంబంధించిన బడ్జెట్లో 900 కోట్ల రూపాయల కోత విధించిందని,అలాగే సామాజిక సేవలకు సంబంధించిన బడ్జెట్లో 1200 కోట్ల రూపాయల కోత విధించిందని,వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్కీములను ఓకే గొడుగు కింద అమలు చేసే అంబరిల్లా స్కీమ్స్ సంబంధించిన బడ్జెట్లో కూడా 1200 కోట్ల రూపాయల కోత విధించిందని,మైనార్టీ సంక్షేమ బడ్జెట్ చూసినప్పుడు కోతలు,తగ్గింపులే కనిపిస్తున్నాయన్నారు.మైనార్టీ సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష పాటిస్తున్నదని,బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వివక్షను ఆవాజ్ సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.