తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

సూర్యాపేట జిల్లా:పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇళ్ళు,ఇళ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు,పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు.

 Collectorate Siege Under Telangana Praja Sanghas Struggle Vediki-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు అవుతున్నా నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు.సూర్యాపేట జిల్లాలో 1991 నుండి 2000 వరకు 130 గ్రామాలలో బలహీన వర్గాల కాలనీల కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని,అట్టి భూమిని పేదలకు పంచి ఇవ్వకపోవడం మూలంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని,పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

పేదల అధీనంలో ఉన్న భూమికి వెంటనే పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం అవి పూర్తయి ఆరేళ్లు అవుతున్నా నేటికీ లబ్ధిదారులను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

జిల్లాలలో ఇంకా అసంపూర్తిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఫండ్స్ కేటాయించి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయాలని కోరారు.

జిల్లాలో వేలాది ఎకరాలలో ప్రభుత్వ భూములను భూస్వాములు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు,అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అక్రమంగా అప్పనంగా అనుభవిస్తుంటే వారి నుండి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవిన్యూ యంత్రాంగం,పోలీసులు అక్రమార్కులకు అండదండలుగా ఉంటూ సహకరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఇల్లు ప్రజా జీవనానికి అనుకూలంగా లేదని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని నేటికి అమలు చేయలేదన్నారు.

రేషన్ కార్డులు లేక లక్షలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.వృద్ధులు, వితంతువులు,వికలాంగులు,ఒంటరి మహిళలు, చేతివృత్తిదారులు పింఛన్ల కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా వారికి పింఛన్లు ఇవ్వకుండా ఘోష పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.రైతాంగానికి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరారు.

మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.దళిత బంధు పథకం ద్వారా దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు.

దళిత,గిరిజనులకు ఉచిత కరెంటును ఇవ్వాలని,పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములను రక్షించాలని కోరారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, కల్లుగీత కార్మికులను పరిష్కరించి జిల్లాలో తాటి,ఈత ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, 50 ఏళ్ళు నిండిన కళాకారులకు ఐదువేల రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

గొర్రెల,మేకల పెంపకం దారులకు నగదు బదిలీ అమలు చేసి గొల్ల,కురుమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.అంతకుముందు దురాజ్ పల్లి లోని అనాధాశ్రమం నుండి కలెక్టరేట్ వరకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా పరిపాలన అధికారి శ్రీదేవికి సమర్పించారు.అంతకుముందు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షత సభకు జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్,సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి,గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ రవినాయక్,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube