సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు,విడోస్,ఒంటరి స్త్రీలు,గీత,నేత,బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద నెలనెలా రూ.2016/-,రూ.3016/- పెన్షన్లు ఇస్తూ నిస్సాహయస్థితిలో ఉన్నవారికి చేయూతనిస్తున్న విషయం తెలిసిందే.కానీ,కొందరు స్థానిక రాజకీయ నేతల స్వార్థంతో,కొంతమంది అవినీతి అధికారుల అలసత్వంతో అర్హత ఉన్నా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నవారు అనేకమంది ఉన్నారు.
తోటి వారికి పెన్షన్ వస్తుంటే అర్హత ఉన్నా తమకు పెన్షన్ రాకపోవడంతో ఏళ్ల తరబడి ఆశగా ఎదురు చూస్తున్నారు.అలాంటి వారి పరిస్థితిని చూసి చలించి,ప్రభుత్వ ఆసరా పథకం కోసం వేచి చూడకుండా తానే గ్రామ ఆసరా పథకం ప్రారంభించిన ఓ గ్రామ కమ్యూనిస్ట్ సర్పంచ్ పాలనా దక్షత నవంబర్ 1న ప్రజలకు తెలిసింది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి (సీపీఐ) ప్రభుత్వ ఆసరా పెన్షన్లు అందని వారిని గుర్తించి వారందరికీ సొంతంగా గ్రామ ఆసరా పథకం ప్రవేశపెట్టాడు.గ్రామంలో అర్హత ఉండి, ప్రభుత్వం నుండి పెన్షన్ అందని వృద్ధులకు, వికలాంగులకు,వితంతువులకు ప్రతి నెలా రూ.2000 పెన్షన్ ఇచ్చి ఆదుకుంటానని మంగళవారం గ్రామ ఆసరా పథకం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్ధం బ్రదర్స్ యొక్క ఆలోచనలో నుండి పుట్టిందే ఈ గ్రామ ఆసరా పథకమని తెలిపారు.
పెన్షన్ కు అర్హత ఉండి,కొన్ని కారణాల వల్ల రాని వారికి ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేంతవరకు బద్ధం బ్రదర్స్ తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మాకున్న దానిలో నుంచి ఎంతో కొంత పేద ప్రజలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ రోజు నుండే గ్రామంలోని అర్హులకు పెన్షన్ అందజేశామని,ఇలాగే ప్రతీ నెలా ఒకటవ తేదీన పెన్షన్ అందిస్తామని అన్నారు.శాంతి నగర్ సర్పంచ్ బద్ధం కృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ చేస్తున్న ఈ మంచి కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ,నిజమైన ప్రజా ప్రతినిధి అంటూ కితాబిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి గౌరమ్మ,భద్రారెడ్డి,కృష్ణారెడ్డి,వెంకట్ రెడ్డి,పుల్లారెడ్డి,అఫ్జల్,నారాయణరెడ్డి,సింగారెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి,లక్ష్మీనారాయణ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.