సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఏ.ఐ.
ఎఫ్.డి.ఎస్.రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పల్లే మురళి,గడ్డం నాగార్జునలు అన్నారు.ఆగష్టు 25 న అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్.) ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైన మోటార్ సైకిల్ యాత్ర కామారెడ్డి,నిజామాబాద్,నిర్మల్,ఆదిలాబాద్,కొమురంభీం మంచిర్యాల,పెద్దపల్లి,ములుగు,వరంగల్ జిల్లాల మీదుగా 950 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 5వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది.ఈ సందర్భంగా వారికి పలు విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు పూలమాలతో స్వాగతం పలికారు.అనంతరం భీంరెడ్డి నర్సింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యాలయాల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని,ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారే తప్ప విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని వాపోయారు.
కరెంట్,వాటర్ సమస్యలు,పక్కా భవనాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఆరోపించారు.వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్.ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.విద్యారంగ సమస్యల సాధనకై పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలనే విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.
ఈ యాత్ర నేడు అనగా ఆగస్టు 30న రంగారెడ్డి జిల్లాలో ముగుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్ నోమాన్,ఫేక్ అన్వర్,సోహెల్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.