పేద,మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఎం.
వి.ఎన్ భవన్ లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ,నియోజకవర్గ పరిధిలోని మండల కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు.అచ్చే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తుందన్నారు.బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
కార్పోరేట్,పెట్టుబడి దారులైన అదాని, అంబానీలకు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతుందన్నారు.బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగారిచే విధంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ దేశాన్ని అంగడి సరుకుగా మార్చారన్నారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్ విధానాలను నిస్సిగ్గుగా అమలుపరిచే గవర్నర్లతో రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందన్నారు.ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థకు భంగం కలిగించే విధంగా వ్యవరిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తుందన్నారు.
హిందూత్వ ఏజండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దేశంలో ముస్లిం, మైనార్టీలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు.దేశం వెలిగిపోతుందని గొప్పలు చెబుతున్న మోడీ దేశ రాజ్యాంగాన్ని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అన్నారు.
పెట్టుబడి దారులకు,కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద,మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తుందన్నారు.
రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక,ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతూ,రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం లౌకిక,ప్రజాస్వామ్య, అభ్యుదయ,సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్,మేకనబోయిన సైదమ్మ,కొప్పుల రజిత, చినపంగి నర్సయ్య, వీరబోయిన రవి,పెన్ పహాడ్,ఆత్మకూరు (ఎస్) సీపీఎం మండల కార్యదర్శులు రణపంగ కృష్ణ,అవిరే అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.