సూర్యాపేట జిల్లా:ఈనెల 29న సూర్యాపేటలోని గాంధీపార్కులో జరుగు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం సిపిఎం జిల్లా కార్యాలయం ఎం వి ఎన్ భవనంలో మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజలను దోపిడీ నుండి విముక్తి చేయడం కోసం సాగిన మహత్తర వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని అన్నారు.చిన్నతనంలోనే బందూకి చేతబట్టి దొరలు,జాగీర్దార్ లను,భూస్వాములను ఎదిరించి పోరాడిన మహా యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.
తను బ్రతికినంత కాలం అరుణ పతాకాన్ని చేతబట్టి అనేక పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని పేర్కొన్నారు.నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నరని అన్నారు.
మల్లు స్వరాజ్యం మన నుండి దూరమైన వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.దీనిలో భాగంగా ఈ నెల 29వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో జరుగు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి సభని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్,కోట గోపి,మేకనబోయిన శేఖర్,చినపంగి నరసయ్య,మేకనబోయిన సైదమ్మ, కొప్పుల రజిత,పట్టణ నాయకులు ఎం.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.