లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టం.చాలామంది భక్తులు ఆ అమ్మవారిని శుక్రవారమే పూజించడానికి కారణాలు ఏంటి ? పురాణాల్లో లక్ష్మీదేవికి, శుక్రవారానికి ఉన్న సంబంధం ఏంటి…?
పురాణాల ప్రకారం రాక్షసుల అందరికీ ఒక గురువు ఉండేవాడట.ఆ గురువు పేరే శుక్రాచార్యుడు.ఆ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని పురాణాలు తెలిసిన పండితులు చెబుతుంటారు.శుక్రాచార్యుడి తండ్రి పేరు భృగు మహర్షి.ఈ భృగుమహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతుంటారు.
అలా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడని… అందుకే ఆ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతీకరమైనదని పురాణాలు చెబుతున్నాయి.అలాగే తమ గురువుకు సోదరి అయిన లక్ష్మీ దేవి పట్ల రాక్షసులకు కూడా భక్తి ఉండేదని చెబుతుంటారు.
లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఆ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిస్తే.అమ్మవారు భక్తుల భక్తికి మెచ్చి వారు కోరిన వరాలు ఇస్తుందనేది బలమైన విశ్వాసం.
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందిన వాళ్లు ఆమెను శుక్రవారమే పూజించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి.అందుకే లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కూడా శుక్రవారమే నిర్వహిస్తారు.

అమ్మవారి చేతిలో మొగ్గ దేనికి సంకేతం.
మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి.ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసితపద్మంపై ఆశీనురాలై ఉంటుంది.ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గరూపంలో ఉంటుంది.
సౌందర్యానికి, నిర్మలతకు సంకేతం అది.పద్మం బురద నుంచి పుడుతుంది.మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం.మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది.ఈ నీరు జీవానికి సంకేతం.ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది.
అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది.ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి.
ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు.