సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంటిమెంట్ ను ఆయుధంగా చేసుకొని అందరినీ నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎనిమిదేళ్ళ పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మహాప్రస్థాన పాదయాత్రలో భాగంగా బుధవారం కోదాడ నియోజకవర్గపరిధిలోని నడిగూడెం మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్నా రాష్ట్రంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదని విమర్శించారు.రుణమాఫీ,ఉచిత ఎరువులు అని రైతులను మోసం చేశారని,ఫీజు రీయింబర్స్మెంట్ అని విద్యార్థులను మోసం చేశారని, డబుల్ బెడ్ రూం అని పేదలను మోసం చేశారని, మూడెకరాల భూమి అని దళితులను మోసం చేశారని,డ్వాక్రా రుణాలని మహిళలను మోసం చేశారని,పర్మినెంట్ చేస్తానని కాంటాక్ట్ ఉద్యోగులను మోసం చేశారని,నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను మోసం చేశారని,కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని పిల్లలను మోసం చేశారని,జిల్లాకో సూపర్ స్పెషాలిటీ,నియోజకవర్గ కేంద్రం లో 100 పడకల ఆసుపత్రి,మండలానికో 30 పడకల ఆసుపత్రి అని చివరికి రోగులను కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
కేసీఆర్ మోసాల చిట్టాను ఇలా చెప్పుకుంటే పోతే ప్రతీ మాట,ప్రతీ అడుగు మోసమేనని,మళ్ళీ కేసీఆర్ ను నమ్మితే మనకు బ్రతుకే లేదని అన్నారు.ఇక ఎన్నికలు వస్తున్నాయి కదా జాగ్రత్తగా ఉండండి.
గాడిదలను చూపించి గెలుపు గుర్రాలని నమ్మించి ఓట్లేయమని అంటారని, మీరు నమ్మి ఓటేస్తే ఇక తెలంగాణను ఎవరూ కాపడలేరని తెలిపారు.ఈ సారి మీకోసం పాటుపడే పార్టీకి అవకాశం ఇవ్వండని,వైఎస్సార్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు.