సూర్యాపేట జిల్లా: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను దశాబ్ద కాలం లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో నీరుగార్చి, అమరవీరుల బలిదానాలను అవమానపరిచారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు.జిల్లా కేంద్రంలో జూన్ 4న నిర్వహించే తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకొని ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తారని కేసీఆర్ ను ప్రశ్నించారు.
క్యాబినెట్ నిండా తెలంగాణ వ్యతిరేకులను పెట్టుకొని,ప్రభుత్వ సలహాదారులుగా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులను పెట్టుకొని, సీమాంధ్ర పెట్టుబడి దారి శక్తులతో లాలూచీ పడి తెలంగాణ వనరులన్నీ వారికి ధారపోస్తూ, తెలంగాణ కాంట్రాక్టులన్నీ సీమాంధ్ర కాంట్రా క్టర్ లకు కమిషన్లకు అప్పజెప్పి, తెలంగాణ నీళ్లను అటు ఆంధ్రకు ఇటు మహారాష్ట్ర కు అప్పజెప్తూ నీళ్లు పండుగ చేసుకుందామని చెప్పడం హాస్యాస్పదంగా
ఉందని ఎద్దేవా చేశారు.
ఏ చెరువు కట్టల మీద కట్టమైసమ్మ పండుగలు చేసుకుందామని అంటున్నారో ఆ కట్ట మైసమ్మల మీద ప్రమాణం చేసి మిషన్ కాకతీయలో, మిషన్ భగీరథలో అవినీతి జరుగలేదని చెబుతారా అని సవాల్ విసిరారు.
వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకుంది పండుగలకు, పబ్బాలకు ఇచ్చే చీరసారెల కోసం,సేమ్యాల కోసం కాదని,తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసమని,అందులో నీళ్లు,నిధులు, నియామకాలు కీలక పాత్ర పోషించాలని ఆశించారని గుర్తు చేశారు.కానీ,నీళ్లను కూడా అవినీతి మయం చేసి రీ డిజైనింగ్ లో పేరుతో కాసులకు కక్కుర్తిపడి కాంట్రాక్టులకు అంకితం చేశారని అన్నారు.
నిధులను దుబారా చేస్తూ తెలంగాణను అప్పులపాలు చేశారని, రైతుబంధు బూచి చూయించి మొత్తం వ్యవసాయాన్ని కుప్పకూల్చేస్తూ,
ఆ పేరుతో వ్యవసాయ ఉపకరణాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కానీ,పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు రాష్ట్రం ఏర్పడితే నియామకాలు లభిస్తాయని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని యువకులు బలిదానాలు చేశారో ఆ తరం యువకుల ఉద్యోగ ఆశలపై నీళ్లు చల్లుతూ నోటిఫికేషన్లు వేయకుండా వేసినా ఏదో కొద్దిపాటి నోటిఫికేషన్లలో కూడా ప్రశ్నాపత్రాలు అమ్ముకునే నీచమైన స్థితికి దిగజారారని విమర్శించారు.నాడు ఉద్యమాలతో తెలంగాణ భారతదేశం దృష్టిని ఆకర్షించి,జాతీయస్థాయి పతాకసాయి శీర్షికన వార్తలైతే,నేడు కేసీఆర్ కుటుంబ పుణ్యమా అని లిక్కర్ వ్యాపారంతో ఇసుక మైనింగ్ దందాలతో తెలంగాణను మళ్ళీ పతాకస్థాయికి తీసుకువచ్చారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ పై అనర్గళంగా అబద్ధాలు ప్రచారం చెబుతున్నాడని మొత్తం తెలంగాణ విద్యుత్ పై తొమ్మిదేళ్లుగా జరిగిన కొనుగోలు,ఉత్పత్తి అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేస్తారా? లేదా గొప్పగా చెప్పుకుంటున్న యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద బహిరంగ విచారణకు వస్తారా అంటూ సవాల్ చేశారు.ఈ సమావేశంలో జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య,యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాబొయిన కిరణ్,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.