సూర్యాపేట జిల్లా:జిల్లాలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతూ సమాజంలో సాధారణ వ్యక్తులుగా తిరుగుతున్న ఘరానా దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి,ఆ దొంగల వివరాలు వెల్లడించే సరికి జిల్లా ప్రజలతో పాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు.గతంలో దొంగల ముఠాలు అంటే ఇతర రాష్ట్రాల నుండి,ఇతర ప్రాంతాల వచ్చి ఇక్కడ దోంగతనాలు చేసేవారు.
వారిని అంతరాష్ట్ర దొంగలు,అంతర్ జిల్లా దొంగలు అనేవారు.కానీ,ఇప్పటి దొంగలు ట్రెండ్ ఫాలో కావడం లేదు.
ట్రెండ్ సెట్ చేస్తున్నారు.మన బంధువులుగా స్నేహితులుగా నిత్యం మనతోనే ఉంటూ మనకే తెలియకుండా దొంగతనాలకు పాల్పడటం ఫ్యాషన్ గా మార్చుకున్నారు.
మంచి చదువులు చదువుకొని,ఉద్యోగ,వ్యాపార,రాజకీయ, క్రీడా రంగాల్లో రాణిస్తూ సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి,భవిష్యత్ కు మార్గనిర్దేశం చేయాల్సిన యువతరం ఎందుకు పెడదారి పడుతుంది? చెడు సహవాసాలు పట్టి,చెడు వ్యసనాలకు బానిసలై క్షణకాలం పాటు సుఖాన్ని ఇచ్చే జల్సాలకు అలవాటుపడడంతో ముఖ్యంగా యువత పక్కదారి పడుతోందని ఈ మోటారు సైకిళ్ల దొంగలను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది.చిన్న వయసులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి,వాటిని తీర్చుకునేందుకు డబ్బులు లేక, సులభముగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నేరప్రవృత్తిలోకి దిగుతున్నారని తెలుస్తోంది.
ఆ కోవకు చెందిన వారే నేడు పట్టుబడిన దొంగల ముఠా సభ్యులు.పెయింటింగ్ పని చేసే సూర్యాపేట రూరల్ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కనుకుంట్ల వేణు(21) తండ్రి మల్లయ్య,చికెన్ షాప్ వర్కర్ గా చేసే మోతె మండలం బుర్కచెర్ల గ్రామానికి చెందిన కిన్నెర నవీన్ (22) తండ్రి శ్రీను మరియు అదే గ్రామానికి చెందిన విద్యార్థి కొండ ఉదయ్ కుమార్ (17)తండ్రి నగేష్ వీరు ముగ్గురు స్నేహితులు,వీరికి గౌతమ్ కుమార్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు.
వీరంతా కలసి ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కారు.డబ్బు సులభంగా సంపాదించాలంటే మోటారు సైకిళ్లను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.హైదరాబాద్,సూర్యాపేట పరిసర ప్రాంతాలు,మోతె మండలాన్ని టార్గెట్ చేసుకొని దొంగతనాలు షురూ చేశారు.ఈ ప్రాంతాల్లో కొట్టేసిన మోటార్ సైకిళ్లను సూర్యాపేట నూతన వ్యవసాయ మార్కెట్ ప్రక్కన గల ఖాళీ స్థలంలో భద్రపరిచి,తర్వాత వేరే ప్రాంతానికి తరలించి విక్రయించాలని ప్లాన్ చేశారు.
మోటార్ సైకిళ్లను కొట్టేయడం,భద్రపరచడం వరకు సక్సెస్ గానే పని పూర్తి చేశారు.కానీ,అక్కడి నుండి తరలించడమే ఇబ్బందిగా మారి ఇరుక్కున్నారు.
*పోలీసులకు చిక్కిన విధానం*
శనివారం ఉదయం రోజు వారీ విధుల్లో భాగంగా పోలీసులు సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గల నూతన వ్యవసాయ మార్కెట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.ఆ సమయంలో ముగ్గురు యువకులు 09 మోటారు సైకిళ్లతో అనుమానస్పదంగా కనిపించారు.
అసలే పోలీసులకు ఎవరిని చూసినా మొదట కలిగేది అనుమానమే కదా!వెంటనే వారి దగ్గరకెళ్ళి ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? అంటూ తమదైన స్టైల్లో వివరాలు అడగడం ప్రారభించారు.దాంతో ముగ్గురికి భయంతో ముచ్చెమటలు పట్టి,సరైన సమాధానాలు చెప్పకుండా తడబడుతూ అక్కడి నుంచి పారిపోవుటకు ప్రయత్నించడంతో ముగ్గురిని పట్టుబడి చేసి, విచారియించగా మొత్తం బయోడేటా బయటికొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుండి 09 మోటారు సైకిళ్లు (హోండా ఆక్టివా-01,హోండా షైన్-02,యూనికాన్ బైక్ -01,గ్లామర్ బైక్-02, హెచ్ ఎఫ్-డీలక్స్ బైక్-01,స్ప్లేన్డర్ ప్రో -01,సీడీ డీలక్స్ బైక్ -01) స్వాధీనం చేసుకున్నారు.రికవరి సొత్తు మొత్తము విలువ రూ.4,25,000/-ఉంటుందని అంచనా వేశారు.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సూర్యాపేట డిఎస్పీ ఎస్.మోహన్ కుమార్ ను తెలిపారు.ఈ కేను ఛేదించిన పట్టణ సిఐ ఏ.ఆంజనేయులు,ఎస్ఐలు పి.శ్రీనివాస్, ఎస్.క్రాంతికుమార్,ఎస్.కె.యాకూబ్,ఇ.సైదులు, ఏఎస్ఐ ఎం.అంజయ్య,హెడ్ కానిస్టేబుల్ జి.కృష్ణయ్య,పోలీస్ కానిస్టేబుల్ జె.సైదులు,హోమ్ గార్డ్స్ సీహెచ్.మధు,డి.
రాజులను ఆయన అభినందించారు.