నల్లగొండ జిల్లా: జిల్లాలోని చందంపేట మండలం కాసరాజుపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని చెట్టుకు వేలాడుతూ కనిపించిన దృశ్యం స్థానికంగా కలకలం రేపింది.మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా, సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.బైక్‌పై వచ్చిన ప్రేమ జంట పురుగుల మందు సేవించి, ఆ తర్వాత తాడుతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇదిలా ఉంటే ప్రేమికుల ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు.
మృతుల శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాలకు బలం చేకూరుతుందని, పురుగుల మందు సేవించిన వారు ఉరి వేసుకోవాల్సిన అవసరం లేదని,ప్రేమికులకు సంబంధించిన వ్యక్తులే కొట్టి,పురుగుల మందు తాపించి,ఆ తర్వాత చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతులు రాకేష్, వరికుప్పల దేవిగా పోలీసులు గుర్తించారు.రాకేష్ ఎస్సీ, దేవి బీసీ సామాజికవర్గాలకు వారు కావడంతో వీరి ప్రేమను అంగీకరించక లేక పరువు హత్యకు పాల్పడి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రేమజంట మరణాలను ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా ఇరు కుటుంబాలకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నారు.
ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి.?ఎవరైనా హత్య చేశారా.?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించనున్నారు.ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఆత్మహత్యకు కారణలేంటి.? అనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.