ఆశ్వీయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ 10 రోజుల పాటు దసరా ఉత్సవాలను దేశమంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పూజిస్తారు.
వీటిని నవరాత్రులు అని భావిస్తారు.ఈ నవరాత్రులు శరదృతువులో జరుగుతాయి కాబట్టి వీటిని శరన్నవ రాత్రులుఅని కూడా పిలుస్తారు.
అక్టోబర్ 25 ఆశ్వీజ శుద్ధ దశమి నాడు దసరా పండుగను జరుపుకోవడం అనాదిగా వస్తోంది.ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజు అంతేకాకుండా స్థితికారకుడైన విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే శ్రవణంతో కూడుకున్న దశమిని విజయదశమి అని భావిస్తారు.
ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా దసరా వేడుకలను జరుపుకుంటారు.
మన పురాణ ఇతిహాసాల ప్రకారం దేవ దానవులు క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి దశమి రోజున మహాలక్ష్మి ఉద్భవించినప్పుడే అమృతం కూడా ఉద్భవించిందని మన పురాణ ఇతిహాసాలలో పేర్కొన్నారు.
అందువల్ల ఆశ్వయుజ మాసం శ్రవణా నక్షత్రంలో కలిసిన దశమిని విజయదశమి గా భావిస్తారు.
ఈ విజయదశమి రోజున ఆశ్వయుజ శుక్ల దశమి నక్షత్రోదయ వేళనే అంటే సంధ్యా సమయాన్ని ఎంతో పవిత్రమైన సమయంగా భావిస్తారు.
ఈ సమయంలో ఎటువంటి పనులుప్రారంభించడానికైనా ఎంతో అనువైన సమయం.ఈ రోజున చేసేటటువంటి ఎటువంటి శుభ కార్యానికైనా ముహూర్తం, గ్రహబలం ఇలాంటివి ఏమి చూడవలసిన పనిలేదు.
విజయదశమి రోజు చేసే ఏ పని లో నైనా తప్పకుండా విజయం సాధిస్తారని ప్రజలు నమ్మకం.విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎర్రని కలువ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
రాజరాజేశ్వరి అష్టకం 108 సార్లు చదివి కర్పూర హారతులతో అమ్మవారిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం.