సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు.అధికారులతో కలిసి పాఠశాల తరగతి గదులను,భోజనశాలను, బాలికల విశ్రాంతి గదులను ఆమె పరిశీలించారు.
పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్దినుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించి, వారితో మనమేకమై ఆటపాటలతో ఆనందం నింపాలని,పిల్లలతో పాటుగా సిబ్బంది కూడా ఆటపాటల్లో కలిసి ఉండాలని,వారికి అన్ని విషయాలలో మానసిక ధైర్యాన్ని నింపాలని, చదువుతో పాటుగా అన్ని విషయాలలో బాలికలు పాల్గొనేలా వారికి తెలపాలని,విద్యార్థుల మానసిక ఉల్లాసం విద్యార్థుల శారీరిక కార్యకలాపాలు విద్యార్థుల తల్లిదండ్రులతో సంబంధాలు,సిబ్బంది విద్యార్థులను ఉత్సాహపరుస్తూ చదువుపై ఆసక్తి పెరిగేలా మంచి వాతావరణం గురుకులాలలో ఉండాలని సెక్రటరీ సూచించారు.
ప్రభుత్వం విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించడం కోసం సైకాలజిస్టుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కమిటీలో సభ్యులుగా డాక్టర్ అనిల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్రియాట్రి సూర్యాపేట,డాక్టర్ సరస్వతి మనోరోగ చికిత్స విభాగం,జ్యోతిపద్మ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వికారాబాద్,ఉమామహేశ్వరి ఓఎస్ డి స్టూడెంట్ కౌన్సిలింగ్ ఉన్నారని తెలిపారు.
ఈకార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ అనంతలక్ష్మి,ప్రశాంతి, నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి,ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎం.ప్రేమలత,జూనియర్ లెక్చరర్స్ కె.హైమావతి, పి.రమాకుమారి,డి.శ్రీలత సిబ్బంది పాల్గొన్నారు.