సూర్యాపేట జిల్లా:రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పోలీసులు చేపట్టవలసిన వ్యూహాలు, ముందస్తు ప్రణాళికలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) సూర్యాపేట సబ్ డివిజన్ పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ఆయన పలు సలహాలు సూచనలు చేశారు.
ఎన్నికల నియమాలను అమలు చేస్తూ ప్రజలు పూర్తి స్వేచ్ఛతో ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతను కల్పించడం పోలీస్ ముఖ్య విధి అని,ఇందుకోసం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం పని చేయాలని, అక్రమ రవాణాను నిరోధించటం కోసం పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు పోలీసు అదుపులో ఉంటాయని తెలిపారు.
నకిలీ మద్యం, నార్కోటిక్ పదార్థాలు, గుడుంబా,రశీదులు లేనటువంటి విలువైన ఆభరణాలు,అక్రమ డబ్బు ఎట్టిపరిస్థితుల్లో సరఫరా, రవాణా జరగడానికి వీలు లేదన్నారు.ఎన్నికల నియమాల అమలుకు అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ, స్థానికంగా పరిస్థితులను అదుపులో ఉంచుకొని, సమాచార వనరులను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ప్రజావ్యవస్థకు సమాజానికి భంగం కలిగించేటటువంటి వ్యవస్థీకృతమైన కార్యకలాపాలను పకడ్బందీగా నిరోధించాలని,అలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరారు.సరిహద్దు ప్రాంతాల నుండి జిల్లాలోకి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా బలోపేతం చేస్తూ పనిచేయాలన్నారు.
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బాగా పెంచాలని,వాహన తనిఖీలను పకడ్బందీగా చేయాలన్నారు.సమావేశం నందు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం,డిసిఆర్బి డిఎస్పి రవి,యాంటీ నార్కోటిక్ విభాగం డిఎస్పీ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్,ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్, సీఐ రాజశేఖర్,అశోక్, మురారి,ఎస్ఐలు పాల్గొన్నారు.