సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వ హయాంలో తెల్లకాగితాలు,స్టాంపు పేపర్స్,నోటి మాట ద్వారా భూములు కొనుగోలు చేసుకున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సాదా బైనామా( Sada Bainama ) ద్వారా దరఖాస్తు చేసుకుని పట్టాదారులుగా మారాలని భూ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించింది.మీసేవ కేంద్రాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా కేవలం యూజర్ ఛార్జ్ మాత్రమే తీసుకొని దరఖాస్తులను స్వీకరించారు.
కానీ, సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండలంలో ఐదేళ్లు గడిచినా నేటికీ ఒకటంటే ఒక్క సాదా బైనమా దరఖాస్తుకి కూడా పట్టా మంజూరు కాలేదని దరఖాస్తు చేసుకున్న బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి పట్టాలు అందించిన ప్రభుత్వం, సాదాబైనామా సంగతి మరిచిందని బాధిత రైతులు వాపోతున్నారు.
సాదా బైనామా చేసిన భూములకు 13 -బి ఫారం జారీ చేసినా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వక రైతుబంధు,రైతు బీమా,బ్యాంక్ క్రాప్ లోన్ వంటి వాటికి నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నా మని,అదే కాకుండా క్రయవిక్రయాలకు కూడా వీలు లేక,కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు వాపోతున్నారు.
ఇప్పటికైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని రైతులు కోరుతున్నారు.రేపాల గ్రామంలో సర్వే నెంబర్ 648/12 లో నాకు 0.50 సెంట్ల భూమి కలదు.గత ప్రభుత్వంలో సాదా బైనామా దరఖాస్తు చేసుకున్నాను.2019 లో అదనపు కలెక్టర్ భూ ప్రక్షాళన కార్యక్రమంలో 13 -బి ఇచ్చారు.కానీ,ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం( Passbook ) ఇవ్వలేదు.తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.నిరుపేద కుటుంబాలకు చెందిన మేము చాలా ఇబ్బందులు పడుతున్నం.ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హులం కాలేకపోతున్నాం.ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మా సమస్యకు పరిష్కారం చూపాలని రేపాల గ్రామానికి చెందిన బాధిత మహిళా ఆవేదన వ్యక్తం చేశారు.13 -బి మరియు సాదా బైనామా పట్టాలకు మాకు గత ప్రభుత్వం నుండి ఎలాంటి గైడ్ లైన్స్ లేని కారణంగా పట్టాలు చేయలేకపోయాం.ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు పట్టాలు ఇయ్యాలని గైడ్ లైన్స్ వస్తే అర్హులైన వారందరికీ పట్టాలు అందజేస్తామని మునగాల తాహశీల్దార్ ఆంజనేయులు చెబుతున్నారు.