సూర్యాపేట జిల్లా:నూతనకల్ నుండి సంగెం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ మంగళవారం సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నూతనకల్ నుండి సంగెం వరకు పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రోడ్లమీద నూనె పోసి ఎత్తుకునేలా చేస్తామని,అద్దంలా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు అనేకచోట్ల చెప్పారని,కానీ, ఎనిమిది సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై ప్రజలకు ఇబ్బందిగా మారాయని, వర్షం వస్తే గుంతలు నిండి ద్విచక్ర వాహనదారులు గుంతలో కాళ్లు చేతులు ఇరగ కొట్టుకున్నారని ఆవేదన చెందారు.
కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు.కనీసం కాలినడకన కూడా నడవలేని పరిస్థితి దాపురించిందన్నారు.
కారణం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గాదారి కిషోర్,అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు.ప్రజా సమస్యల పట్టించుకోకుండా సంపాదన ధ్యేయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే,నాయకులు తమ ఇష్టం వచ్చన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇకనైనా ఎమ్మెల్యే గాదారి కిషోర్ స్పందించి యుద్ధ ప్రాతపదికన నూతన కల్ నుంచి సంగెం వరకు,అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ తుంగతుర్తి నియోజకవర్గ డివిజన్ కమిటీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.లేనియెడల మా పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేవరకు ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,తుంగతుర్తి ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి దొంతమల్ల రామన్న,పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎర్ర అఖిల్, పుల్లూరు సింహాద్రి,జిల్లా నాయకులు రామోజీ, బాణాల వెంకట్ రెడ్డి,జయమ్మ,రేణుక,సంతోషి, చంద్రకళ,కరుణాకర్,రాజేష్,జహంగీర్,వీరన్న తదితరులు పాల్గొన్నారు.