సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం నుండి ఇసుక పర్మిషన్ తీసుకున్నాం అంటూ ఒక ట్రాక్టర్ ట్రిప్ కు పర్మిషన్ తీసుకొని రోజుకు పది ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను పద్దతి ప్రకారం అక్రమంగా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో అనేక అనుమానాలకు తావిస్తోంది.అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి గ్రామ శివారులో ఉన్న పాలేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది.
ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన దందా అని అందరికీ తెలిసిందే.కానీ,ఓ ప్రజా ప్రతినిధి ఇసుక దందాకు కొత్త అర్దం చెప్పాడు.
పద్ధతిగా ఒక ట్రాక్టర్ కి పర్మిషన్ తీసుకొని దానిని చూపిస్తూ రోజుకు 10 ట్రిప్పుల ఇసుకను యధేచ్చగా తరలిస్తాడు.సక్రమ మార్గంలో ఒక ట్రిప్ కు పర్మిషన్ తీసుకొని అక్రమ మార్గంలో పలుట్రిప్పుల ఇసుకను కొల్లగొడుతూ,సమీప గ్రామాల్లో డంప్ చేసి, ఒక్కొక్క ట్రిప్పుకు రూ.4000 నుండి రూ.5000 వరకు విక్రయిస్తున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ కట్టడాలకు ఇసుక రవాణా చేస్తున్నామని చెబుతూ రోజుకు అధిక సంఖ్యలో ఇసుకను తరలిస్తున్నారు ప్రభుత్వ అనుమతులు రోజుకు ఒకటి లేదా రెండు ట్రిప్పులకు మాత్రమే ఉంటుంది.కానీ,సదరు ప్రజాప్రతినిధి ట్రాక్టర్ కి మాత్రం కౌంట్ ఉండదని తెలుస్తోంది.
ఇష్టానుసారంగా భూగర్భజలాల పరిమితికి మించి గుంతలు తవ్వుతూ ఇసుకను వెలికితీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా అధికార బలం ఉందనే భయంతో అతనిని ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయడం లేదని స్థానికులు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.ఖమ్మం,సూర్యాపేట జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉన్న పాలేరు వాగులో రెండు ప్రాంతాల వారు ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా ఇదేంటని ప్రశ్నించే నాధుడే లేకపోవడం గమనార్హం.
ఇంత జరుగుతున్నా మా దృష్టికి రాలేదని, మిగతా శాఖలకు కూడా చెప్పండిని అనంతగిరి తహశీల్దార్ రవి చెప్పడం గమనార్హం.ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నామని,సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఒత్తిడిలో ఉన్నామని, ఇసుక అక్రమ రవాణా విషయం తమ దృష్టికి రాలేదని,అనుమతి లేకుండా అక్రమ రవాణా జరిపితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పనిలో పనిగా ఈ విషయంపై రెవెన్యూ డిపార్ట్మెంట్ కే కాక మైనింగ్ ఇతర డిపార్ట్మెంట్లకు కూడా సమాచారం అందించాలని సలహా ఇచ్చారు.