సూర్యాపేట జిల్లా:లాభదాయక పంట సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వ్యవసాయ అధికారులతో రైతులకు అందుతున్న పలు పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రస్తుతము అమలవుతున్న పథకాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.జిల్లాలో ఎక్కడకూడా పంట వివరాల నమోదు (crop booking) పక్కాగా ఆన్లైన్ లో నమోదుచేయాలని, పంటల సాగు ముమ్మరంగా జరుగుచున్న ఈ సీజనులో వ్యవసాయ విస్తరణ అధికారులు,మండల వ్యవసాయ అధికారులు,సహాయ వ్యవసాయ సంచాలకులు,జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అలాగే రైతు వేదికల ద్వారా లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.
నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ సలహాలు,సూచనలు రైతులకు అందించాలని ఆదేశించారు.ఈ సీజన్ లో రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులను అన్ని మండలాలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అనంతరం క్లస్టర్స్ వారీగా రైతులకు అందుతున్న పలు పథకాలపై అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్,సహాయ వ్యవసాయ సంచాలకులు,మండల వ్యవసాయాధికాలు తదితరులు పాల్గొన్నారు.