సూర్యాపేట జిల్లా:జిల్లాలను పచ్చని తివాచిగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలోని అటవీ శాఖ అర్బన్ పార్కును మంత్రి ప్రారంభించి, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్,మున్సిపల్ చైర్ పర్సన్ పి.
అన్నపూర్ణలతో కలసి మొక్కలను నాటారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ప్రగతి కింద 144 పార్కులు,అలాగే పల్లె ప్రగతి కింద 679 పార్కులను చేపట్టామని అన్నారు.
పట్టణాలకు పోటీగా పల్లెలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు.పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని,పార్కులలో పండ్ల,పూల,ఆటవిజాతి మొక్కలను నాటడం జరిగిందని,అలాగే ప్రతి పార్కులో కూడా అన్ని వసతులు కల్పించామని చెప్పారు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,సంరక్షించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో షెడ్యూల్ ప్రకారం జిల్లా అంతట ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని,ప్రజా ప్రతినిధులను,జిల్లా యంత్రాంగాన్ని అభినదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ కుమారి బాలునాయక్,జడ్పీటిసి సంజీవ్ నాయక్,ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్,డి.ఎఫ్.ఓ ముకుంద రెడ్డి,సి.ఈ.ఓ సురేష్,పి.డి.కిరణ్ కుమార్,డి.పి.ఓ యాదయ్య,వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.