సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన కార్యక్రమం ప్రజా పాలనని,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే,జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్.ప్రియాంక వెంకట్ రెడ్డి కలిసి నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం కోరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.డిసెంబర్ 28వ తారీకు నుండి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
డిసెంబర్ 31 జనవరి 1 తేదీన ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆరోజు కార్యక్రమం ఉండదని, ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించే మహాలక్ష్మి,రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు,చేయుత ఆరు పథకాలపై అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.గ్రామసభల నిర్వహణ ముందుగా చిన్న గ్రామ పంచాయతీలను తీసుకోవాలని,ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రోజుకు రెండు గ్రామపంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.తాహశీల్దార్లు, ఎంపీడీవోలు,ఎంపిఓలు, ఎంఈఓలు,డిప్యూటీ తాహశీల్దార్లు టీములుగా ఏర్పాటు చేసుకొని కుటుంబాల వారిగా చిన్న జీపీలో 4 కౌంటర్లు ఏర్పాటు,మధ్యస్థ గ్రామాలలో 8 కౌంటర్లు, పెద్ద గ్రామపంచాయతీలలో 12 కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతిరోజు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు,మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.దరఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందజేస్తుందని అర్హులైన వాళ్లు దరఖాస్తులు వారి గ్రామంలో గ్రామ సభ జరిగిన రోజున అందజేయాలన్నారు.
ప్రజాపాలనపై ప్రతి గ్రామంలో మున్సిపల్ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టాలని దండోరా చేపట్టాలని,ఒకరోజు ముందుగా టామ్ టామ్ వేయించాలని తెలిపారు.ప్రజాపాలనకు సంబంధించి వాల్ పోస్టర్లు,కరపత్రాలు ముద్రించాల్సిందిగా డిపిఓ యాదయ్యకు కలెక్టర్ తెలిపారు.
గ్రామ సభలు జరిగే ప్రాంతంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓ కోటాచలంకు ఆదేశించారు.అంగన్వాడి సిబ్బంది,ఆశాలు ప్రతి కుటుంబానికి దరఖాస్తు అందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.పోలీస్ సిబ్బంది గ్రామసభల వద్ద బందోబస్తు క్రౌడ్ మేనేజ్మెంట్ చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కిరణ్ కుమార్,ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ, డిడబ్ల్యుఓ జ్యోతి పద్మ, జెడ్పిసిఈఓ సురేష్ కుమార్,డిఎల్పిఓ రెడ్డి, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి,ఎలక్షన్ డిటి శ్రీనివాసరాజు,ఈ సెక్షన్ సూపర్డెంట్ వాజిద్ అలీ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
.