జిల్లాలో మార్చి,ఏప్రిల్ మాసాలలో నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని విద్యా అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పది, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావులతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుండి 13 వరకు ఉదయం 9.30 నుండి మద్యాహ్నం 13.45 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని,అలాగే 69 కేంద్రాలలో 12386 మంది విద్యార్థులు హాజరవుతున్నందున ముందుగా అన్ని మౌళిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా త్రాగునీరు, నిరంతర విద్యుత్, ఏఎన్ఎంతో పాటు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.అలాగే జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 నుండి మద్యాహ్నం 12 వరకు 33 కేంద్రాలలో 16390 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, మొదటి సంవత్సరం 6727 అలాగే రెండోవ సంవత్సరం 7089 మంది, ఓకేషనల్ మొదటి సంవత్సరం 1515, రెండవ సంవత్సరం 1399 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనుచున్నందున వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలనిఅన్నారు.
అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని కేంద్రాలో నియమించిన సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్.డి.ఓ రాజేంద్రకుమార్, డి.ఈ.ఓ అశోక్,డి.పి.ఓ యాదయ్య,డి.ఐ.ఈ.ఓ కృష్ణయ్య,పోలీస్,మెడికల్, పోస్టల్,ఆర్.టి.సి,విద్యుత్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.