యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలం దండుపాల్కాపురం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీజయ ఫార్మా కంపెనీలో గత రెండేళ్లుగా ఆపరేటర్ గా పనిచేస్తున్న వలిగొండ మండలం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి కృష్ణ( Krishna ) (27) గురువారం రాత్రి విధుల్లో భాగంగా ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండా వ్యర్థరసాయన ట్యాంకులోకి దిగడంతో విషవాయువుల కారణంగా స్పృహ కోల్పోయాడని,ఇది గమనించిన తోటి సిబ్బంది యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా వెంటనే హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు.కానీ,అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతునికి భార్య,ఒక కుమారుడు ఉన్నారు.భార్య శివరాత్రి సుష్మ స్వరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉండగా శ్రీజయ పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు లేకనే కృష్ణ మృతి చెందారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మృతుని కుటుంబానికి రూ.45 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చకున్నట్లు సమాచారం.







