ఆమె మాటే…తుపాకి తూటా:ములకలపల్లి రాములు

సూర్యాపేట జిల్లా:తెలంగాణలోని హైదరాబాద్‌ సంస్థానంలో ఫ్యూడల్‌ వ్యవస్థ,జాగీర్దార్‌, రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యా కమైన స్త్రీలు-పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం.నిజాం సంస్థానంలో కనీస పౌరహక్కులు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం.

 Her Word Is...gun Fire: Mulakalapalli Ramulu, Mallu Swarajyam ,thungathurthy,-TeluguStop.com

రైతుల మీద మోయలేని పన్నుల భారం,మధ్య యుగాలనాటి ఫ్యూడల్‌ అణిచివేత విధానం, లేవీ ధాన్యం వసూళ్లు,రాచరిక రాజ్యంలో,నైజాం నవాబు పరిపాలనలో ఎన్నో దురాఘతాలు,ఎన్నోన్నో దుర్మార్గాలు.స్వేచ్ఛా వాయువులేని చీకటి రాజ్యమది.

వెట్టిచాకిరీ, సాంఘిక ఆర్థిక దోపిడీ, ప్రజలకు ప్రాణరక్షణ లేని బానిస యుగాలనాటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి కాలమది.

చిరుప్రాయంలో బంధూకు చేతబట్టి భూస్వా ములను,నైజాం రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత,విప్లవ ధృవతార కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం( Mallu Swarajyam )ఆమె(ఉమ్మడి నల్లగొండ జిల్లా) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో భీంరెడ్డి రాంరెడ్డి-చుక్కమ్మ లకు జన్మించారు.

‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్లు ఆమె చిన్ననాడే పోరాట పంథాను ఎంచుకున్నారు.పదకొండేండ్ల వయస్సులో ఆమె తండ్రి చనిపోయాడు.అక్క శశికళ ( Sasikala )కూడా పోరాటంలో మూడేండ్లు జైలు జీవితం గడిపారు.స్వరాజ్యం తల్లి చుక్కమ్మ గొప్ప సామ్యవాది.

తన కుటుంబమంతా నేటికి విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని ఉన్నది.నాడు చెక్క పలకలపై ఇసుకలో ఓనమాలు దిద్దుకొని క్రమంగా ఐదోతరగతి వరకు విద్యనభ్యసించారు.

చిన్నతనంలో కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా,తన సొంత గ్రామంలో గ్రామ పటేండ్లను, పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టి కూలీ రేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం ఎనిమిది దశాబ్దాల పాటు ఎన్నడూ వెనుదిరగలేదు.విప్లవమే జీవితంగా భావించి ఎన్ని కష్టనష్టాలొచ్చినా ఆమె పోరాటాలకు తట్టుకోలేక పోలీసులు సొంతింటిని ధ్వంసం చేసినా,స్వరాజ్యంను పట్టుకుంటే నాటి ప్రభుత్వం బహుమతులు కూడా ప్రకటించినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు.

తన అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.ఎన్‌) అడుగుజాడల్లో పోరాటాల్లోకి వచ్చిన ఆమె ఏనాడూ మడమ తిప్పలేదు.పోరాటమే ఆయుధంగా గెరిల్లా దళాల్లో చేరి దొరల దుర్మార్గాలను ఎదుర్కొంటూ నైజాం రజాకార్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ధీరవనిత.విప్లవోద్యమంలో తనదైన ముద్రవేసుకొని అలుపెరగని పోరాట యోధురాలిగా ‘ఆమె మాటే.

తుపాకి తూటా’లా ప్రభుత్వాల్ని గడగడలాడించినా ఆమె ధీరత్వానికి వర్ధంతి సందర్భంగా లాల్ సలామ్‌.

తెలంగాణలో భూమికోసం, భుక్తికోసం,వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె ముఖ్య భూమిక పోషించారు.

వెట్టిచాకిరి రద్దు చేయాలని, దున్నే వానికి భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర సాయుధ పోరాటం,ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఉద్యమం.ఆ సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణలో మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.

నాలుగు వేల మంది కమ్యూనిస్టులు,ప్రజలు వీరమరణం పొందారు.పదిలక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేయబడింది.

భూస్వాముల భూములు,గడీలు ప్రజల స్వాధీనమైనవి.వెట్టిచాకిరీ రద్దయింది.

వడ్డీ వ్యాపారం అక్రమ భేదాఖళ్లు నిలిపివేయబడ్డాయి.వ్యవసాయ కూలిరేట్లు పెంచబడ్డాయి.

నైజాం రజాకార్ల బారి నుండి రైతాంగాన్ని రక్షించుకొనేందుకు పదివేల మంది గ్రామరక్షక దళాలు, రెండు వేల మంది గెరిల్లా సాయుధ దళాలు నిర్మించారు.దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం( Land Reforms Act ), కౌలుదారి చట్టం, పౌరహక్కుల చట్టం వచ్చాయి.

ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలు లభించాయి.ఈ చారిత్రక పోరాటంలో మల్లు స్వరాజ్యం పాత్ర అద్వితీయం, అజరామరం.

ఎర్రజెండానే ఊపిరిగా,పోరాటమే ఆయుధంగా 1946,1948 సంవత్సరాలలో సాగిన వీరోచిత రైతాంగ పోరాటంలో ఆమెది కీలకపాత్ర.

నైజాం సర్కారును గడగడలాడించిన ధీశాలి కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌,వరంగల్‌ జిల్లాల్లో దళ కమాండర్‌గా పనిచేసారు.గోదావరి అడవుల్లో మూడేండ్ల పాటు పనిచేసారు.

ఆమె మొదట జోన్‌ కార్యకర్తగా ఆ తర్వాత ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా,గుండాల కేంద్రంలో కోయలను ఉత్తేజపరిచి వారికి నాయకత్వం వహించి పోరాటాలలోకి దింపింది స్వరాజ్యం.భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ అణగారిన వర్గాల్లోకి,వ్యవసాయ కార్మికుల్లోకి చొచ్చుకొనిపోయి వారిలో ఒకరిగా ప్రజలతో మమేకమయ్యే లక్షణం కలిగి ఉండేది.

తదనంతరం మార్క్సిస్టు పార్టీ ఉద్యమంలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తు తుంగతుర్తి శాసనస భ్యురాలిగా,పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా,మహిళా సంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

మల్లు స్వరాజ్యం వ్యక్తి కాదు ఆమె ఒక మహాశక్తి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు ఉద్యమానికి అండదండలిచ్చి,కార్యకర్తలను అక్కున చేర్చుకొని కాపాడటంలో ఎనలేని కృషిచేశారు.

మార్క్సిస్టు పార్టీ ఉద్యమంపై,కార్యకర్తలపై నాడు పాలకపార్టీ గుండాలు హత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో మండే కొలిమిలా మార్క్సిస్టు ఉద్యమంపై దాడులు జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన ఘనత స్వరాజ్యనిది.నల్లగొండ జిల్లాను సమగ్రాభివృద్ధి చేయాలని సాగు,తాగునీరు, ఫ్లోరైడ్‌ నివారణ కోసం నిరంతరం ఆమె గళాన్ని శాసనసభలో ప్రజా పోరాటాల్లో తనవాణిని వినిపించేది.1978లో,1983లో రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి తుంగతుర్తితో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆమెది.తుంగతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీ ద్వారా సాగు, తాగునీటి కోసం నిరంతరం సమరశీల పోరాటం చేసి విజయం సాధించింది.

ఆమె జీవితం అంతా పోరాటాల మయం, ఆమె త్యాగం వెలకట్ట లేనిది,ఆమె చరిత్ర విప్లవోద్యమాలకు పూలబాట, ఆమె పరిపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు.భూస్వామ్య వర్గంలో పుట్టినా పీడిత వర్గాలకోసం తుదిశ్వాస వరకు పనిచేసారు.

నిత్యం పీడితుల కోసం గలమెత్తి నినదించేవారు.ఆమె గొప్ప ఆదర్శ కమ్యూనిస్టు,ఆమె నిరాడంబరత నేటితరానికి ఆదర్శం.

ఎన్నో కుటుంబాలు ఆమె పేరును తమ పిల్లలకు నామకరణం చేసుకున్నారు.ఆమె చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లిఖించబడ్డది.

ఆమె మననుంచి దూరమై రెండేండ్లు గడుస్తున్నా ఆమె పోరాట ఘట్టాలు,నాటికీ,నేటికీ, ఎప్పటికీ ప్రజల మదిలో స్ఫూరిస్తూనే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube