సూర్యాపేట జిల్లా: కుటుంబంలో ప్రతి ఒక్కరి వివరాలు కుటుంబ డిజిటల్ కార్డులో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్( District Collector Tejas Nandalal Pawar ) అన్నారు.శనివారం సూర్యాపేట మున్సిపాల్టీ(Suryapet Municipality) పరిధిలోని 37వ వార్డులో ఓరుగంటి పుష్పవతి, సూర్యనారాయణ ఇంటి వద్ద జరిగుతున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వేను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద 37 వ వార్డులో 5 బృందాలు సర్వే చేస్తున్నాయని,ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించాలని,ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని అధికారులకు సూచించారు.ఒకే ఇంటిలో ఇద్దరు కుమారులు ఉండి వారికి వివాహం జరిగితే రెండు ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించి వారి వివరాలను రెండు ప్రత్యేక డిజిటల్ కార్డుల్లో నమోదు చేయాలని, అలాగే సర్వేకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మరుసటి రోజు అందుబాటులో ఉండమని చెప్పి మరల సర్వే బృందాలు వెళ్ళి వారి వివరాలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.
ప్రజలు అధికారులకు సహకరించి సర్వే విజయవంతం అయ్యేలాగా చూడాలని కోరారు.ఇప్పటివరకు 37వ,వార్డులో 501 గృహలలో సర్వే పూర్తి చేయటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ రావు, తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సూపర్వైజర్లు శ్వెత, జానకిరామిరెడ్డి,సిఓలు,ఆర్పీలు,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.