గత కొన్ని ఏండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూసినది తీరప్రాంతంలో మూసి ప్రాజెక్టు క్రింద ఇసుక మేట తీత పేరుతో క్వారీలు నడుస్తున్నాయి.తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష స్వరాష్ట్రం సిద్దించిన అనంతరం భౌగోళికంగా నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసి నది తీరా ప్రాంత గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక క్వారీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ప్రధానంగా జాజిరెడ్డిగూడెం,వంగమర్తి గ్రామాల పరిధిలో మూసి ప్రాజెక్ట్ క్రింద ప్రస్తుతం నడుస్తున్న ఇసుక క్వారీలు కాళేశ్వరం,యాదాద్రి పవర్ ప్లాంట్,మల్లన్న సాగర్ లాంటి సాగు,విద్యుత్ భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణం కొరకు ఇసుక తరలింపుకు నిర్దేశించారు.అయితే ఇక్కడే అక్రమానికి తెరలేచింది.
గతంలో ఒకటి, రెండు క్వారీలు ఉండేవి కానీ,ప్రస్తుతం ఐదు,ఆరు క్వారీలకు పైన అనుమతులు పొందినట్టు సమాచారం.ఈ క్వారీల్లో టిఎస్ ఎండిసి(తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ)నిర్దేశించిన ఏఒక్క నిబంధన అమలు కాదు.
ఇక్కడ క్వారీల్లో స్టాక్ యార్డ్,వేబ్రిడ్జి,చెక్ పాయింట్ల,సిసి కెమెరాలు లాంటి ఏర్పాట్లు ఏమి ఉండవు.ఉన్నా అవి ప్రభుత్వ మార్గదర్శకలకు అనుగుణంగా ఉండవు.
ఇక క్వారీల సరిహద్దులు, వాటి (జియో ట్యాగ్) హద్దు రాళ్లు కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే ఏర్పాటు చేయబడతాయి.ఇసుక తరలింపు కొరకు సరాసరి ఏరు మధ్యలోనే భారీ వాహనాలు(లారీలు,టిప్పర్లు) లోడింగ్ చేయడం, లెక్కకు మించి ఇటాచిలు, జేసిబిలతో ఇసుక తోడడం జరుగుతుంది.
ప్రజలకు అన్ని విషయాలు పారదర్శకంగా తెలియజేయాని,ఈ క్వారీలు అనుమతి పత్రాలు,అగ్రిమెంట్ కాపీలు స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయాల వద్ద అంటించాలని, అందుబాటులో ఉంచాలనేటిఎస్ ఎండిసి నిబంధన ఉన్నా,అది ఇక్కడ అమలైన చరిత్ర లేదు.ఇక ఈ క్వారీల బాధిత గ్రామ ప్రజలకు వీటి గురించి ఎలాంటి కనీస సమాచారం అందుబాటులో ఉండదు.
ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అన్ని పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులు అన్నీ తెలిసి నిద్ర నటిస్తున్న దుస్థితి నెలకొంది.ఇక్కడికి ఇసుక లోడింగ్ కు వచ్చే లారీలకు,టిప్పర్లకు అసలు టిఎస్ ఎండిసి అనుమతులు ఉన్నాయో లేవో? వాటి జియో ట్యాగింగ్ లాంటి విషయాల గురించి ఎవరికి తెలిసే ప్రసక్తే లేదు.క్వారీల్లో అక్రమాలు జరగకుండా నిఘా కొరకు మైనింగ్ పాయింట్లు ఉండాలి.
రెవెన్యూ,పోలీసుల గట్టి నిఘా ఉండాలి.కానీ,అన్ని శాఖలు తూతుమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నాయని ప్రజల నుండి ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.జిల్లా మైనింగ్ అధికారికి జిల్లాలో ఎన్ని క్వారీలకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చారని ఆర్టీఐ చట్టం ద్వారా అడిగితే వారు కనీసం స్పందించిన దాఖలాలు లేవు.
ఇసుక క్వారీల కాంట్రాక్ట్ పొందిన సంస్థలు,క్వారీల్లో పని చేస్తున్న వాటి ప్రతినిధులు చెప్పిందే ఇక్కడ వేదం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి.గతంలో ఇక్కడ క్వారీల్లో లోడైన ఇసుక లారీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు అక్రమంగా వెళ్తూ మార్గమధ్యంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడి కేసులు నమోదైనవి.
ఇట్లాంటి అనేక ఉల్లంఘనలుజరిగినా, జరుగుతున్నా జిల్లా నిఘా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పులు రాలేదు.
కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాజిరెడ్డిగూడెం-వంగమర్తి గ్రామాల మధ్య నిర్మించిన బ్రిడ్జి (వంతెన)కు ఈ క్వారీల కారణంగా పూర్తి స్థాయిలో ముప్పు పొంచి ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో ఈ క్వారీ (ప్రభావిత) బాధిత గ్రామాల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారనుంది.ముఖ్యంగా భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయ ప్రమాదంలో పడుతుంది.
అక్రమార్కుల ధన దాహానికి ఇక్కడి ప్రజల, ప్రభుత్వ సహజ సంపదైన “ఏరు” భవిష్యత్ లో మట్టి దిబ్బగా మారనుందాని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఇసుక దోపిడిపై పర్యావరణ పరిరక్షణ సంస్థలు,ప్రజా సంఘాలు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.