సూర్యాపేట జిల్లా: మనుషులు తలచుకుంటే మార్పు ఖాయమని నిరూపించారు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని గట్టికల్ గ్రామప్రజలు.ఒకప్పుడు మండలంలో సమస్యాత్మక గ్రామంగా పోలీస్ రికార్డుల్లో ఉన్న గట్టికల్ గ్రామం నేడు ఐక్యతకు, శాంతికి మారుపేరుగా మార్చి నిరూపించారు.
వివరాల్లోకి వెళితే… గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మద్యానికి బానిసలై నిండు నూరేళ్ళు జీవితాన్ని మద్యంలో కోల్పోతూ ఉండడంతో గ్రామంలో కొంతమంది యువకులు,పెద్దలు మద్యం చేస్తోన్న మారణహోమంపై ఆలోచన చేశారు.ఎలాగైనా మద్యాన్ని అరికట్టాలని నడుంకట్టారు.
దానిని అక్టోబర్ 2 గాంధీ జయంతి సరైన సమయమని ఉద్యమాన్ని ప్రారంభించి,గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.12రోజులుగా కొనసాగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమం నేడు పూర్తి మద్యపాన నిషేధ గ్రామంగా మారింది.సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా చరిత్రసృష్టించడంలో ఉద్యమించిన గట్టికల్ గ్రామ ఉద్యమకారులకు, గ్రామస్తులు,మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ మహా కార్యానికి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ కార్యాలయ, సూర్యాపేట ఎక్సైజ్ శాఖ, ఆత్మకూర్ (ఎస్) మండల పోలీస్ శాఖ, గ్రామపంచాయతీ పాలక మండలికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా స్వతహాగా బెల్ట్ షాపులు బంద్ చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకులను గ్రామస్తులు అభినందించారు.