సూర్యాపేట జిల్లా: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను గుర్తించి సత్వరమే వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపాలని సీపీఐ (ఎం ఎల్)ప్రజాపంథా పార్టీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై ఆసుపత్రిలో ఉన్న సమస్యలను రోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సమస్యల నిలయంగా మారిందని, ముఖ్యంగా వాటర్ సమస్యతో పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక్కడ 108 ఒక్కటే ఉండటం వలన పేషెంట్లను సరైన సమయానికి హాస్పిటల్ కి చేర్చలేకపోతున్నారని,స్కానింగ్ కొద్ది రోజులు పని చేస్తే కొద్ది రోజులు పనిచేయడం లేదని అన్నారు.
కొందరు డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని సకాలంలో ప్రభుత్వ హాస్పిటల్ కి రాకుండా,పేషెంట్లకు అందుబాటులో లేకుండా ఇబ్బంది పెడుతున్నారని, శానిటేషన్ సరిగ్గా లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి హాస్పిటల్ లో ఉన్న శానిటేషన్, వాటర్ సమస్యను పరిష్కరించి,108 అంబులెన్స్ లను మండలానికి 2 కేటాయించాలని సూచించారు.అదే విధంగా స్వీపర్స్ కు రూ.20 వేల జీతం చేసి,సకాలంలో అందే విధంగా కృషి చేయాలని,ప్రభుత్వ హాస్పటల్ కు స్పెషల్ పండ్ కేటాయించి, హాస్పటల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగు పరిచి, పేషెంట్లకు సరైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎల్) ప్రజాపంథా కోదాడ డివిజన్ కన్వీనర్ మట్టపల్లి అంజన్న,పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, రామన్న,జిల్లా నాయకులు సింహాద్రి , హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.