సూర్యాపేట జిల్లా: ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు కురవక,సక్రమంగా కరెంట్ సరఫరా చేయక,సాగర్ నీరు విడుదల చేయక ఎడమ కాలువ ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతుంటే రైతులు, రైతు సంఘాలు నిత్యం రోడ్డెక్కడంతో పంటలు దెబ్బతినే దశలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రెండు నెలల తర్వాత అత్యవసరంగా ప్రభుత్వం సాగర్ నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.నీటి విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం జాన్ పహాడ్ మేజర్ కాలువ కింద జాన్ పహాడ్,చెరువుతండా, కల్మెట్ తండా,గుండ్లపహాడ్ గ్రామాల చివరి ఆయకట్టుకు కనీరందక పొట్ట దశకొచ్చిన పొలాలు ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
కాలువ మరమ్మతులు లేక ఎక్కడ నీళ్లు అక్కడే వృధాగా పోయి,తమ చివరి భూములకు నీళ్లు అందడం లేదని, అధికారుల అలసత్వంతో అన్నదాతలు ఆగమైతున్నారని ఆందోళన చెందుతున్నారు.
బోరుబావుల్లో నీళ్లు ఇంకిపోయి,చేతికొచ్చిన పంట పొలాలను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా పంటలను కాపాడలేక పోతున్నామని,రేపో,మాపో సాగర్ నీటిని నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోందని అదే జరిగితే పంటలపై ఇక ఆశలు వదులుకోవడమేనని,మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని శనార్తితో మొరపెట్టుకున్నారు.
ప్రకృతి అనావృష్టికి అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై రైతు బ్రతుకు అగమ్యగోచరంగా తయారైందని,పంటలెండి దిక్కుతోచని స్థితిలో పడ్డ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చివరి ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.నేటితో నీటి విడుదల నిలిపివేస్తామని అమరేందర్ రెడ్డి ఎన్ఎస్పి డిఈ చెబుతున్నారు.
రైతుల పంటలు ఎండిపోతున్నాయని అత్యవసరంగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి,9 రోజులు టైం ఇచ్చారని,నేటితో ప్రభుత్వం ఇచ్చిన సమయం ముగుస్తుందని, నీటిని నిలిపివేయడం జరుగుతుందన్నారు.ఇకపై షెడ్యూల్ అంటూ ఏమీ ఇవ్వలేదన్నారు.
అయితే రైతుల డిమాండ్ మేరకు మరో వారం రోజులు నీటి సరఫరా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.