సూర్యాపేట జిల్లా:అధికార పార్టీ చోటా నేతగా చెలామణి అవుతూ పార్టీలోని కీలక నేతల సహకారంతో సవతి తల్లిని,చెల్లిని వేధిస్తున్న ఓ నాయకుడి నిర్వహకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చెల్లికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని కాజేసే కుట్రతో సదరు చోటా నాయకుడు కుయుక్తులు చేస్తుండగా,ఈ సివిల్ ఎపిసోడ్ లో ఓ ఎస్ఐ తలదూర్చి బాధితులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి బాధిత మహిళలపైన,వారికి అండగా నిలిచిన మహిళ సంఘాల నేతలపైన అసభ్యంగా ప్రవర్తించడం,వారిపై అక్రమ కేసులు బనాయించడం చర్చనీయాంశంగా మారింది.
దీనితో అధికార పార్టీ నాయకుని అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని బాధితులు బోరున విలపిస్తున్నారు.తాము బ్రతికుండగానే చనిపోయినట్లు కాగితాలు సృష్టించి,తమ భూమిని కబ్జా చేసి,ఇదేంటని అడిగితే మీ దిక్కున్నచోట చెప్పుకోండని,అవసరమైతే నిజంగానే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ,పోలీసులతో బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని సవతి తల్లి,చెల్లి,మహిళా సంఘాల నేతలు భయాందోళనకు గురవుతున్నారు.
బాధితుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే… కోదాడ రురల్ మండలం తమ్మర గ్రామనికి చెందిన కోదాటి గోపయ్యకు ఇద్దరు భార్యలు.ఓ కొడుకు, కూతురు పుట్టాక మొదటి భార్య మరణించింది.
పిల్లల యొక్క ఆలనా పాలనా చూసుకునేందుకు కోదాటి గోపయ్య పుష్పావతిని రెండవ పెళ్లి చేసుకున్నాడు.పుష్పావతికి ధనలక్ష్మి అనే ఒక కూతురు జన్మించింది.
ధనలక్ష్మి చిన్నతనంలోనే తండ్రి గోపయ్య చనిపోవడంతో సవతి తల్లిని,చెల్లిని అన్న కోదాటి వెంకటేశ్వర్లు(మొదటి భార్య కుమారుడు) చూసుకుంటున్నాడు.కొంత కాలం వరకు తల్లి,చెల్లిపై ప్రేమ నటించడంతో తండ్రి చనిపోయే వరకు ఏ ఇబ్బంది లేకుండా జీవితం కొనసాగింది.
కోదాటి గోపయ్య మరణానంతరం భార్య పుష్పావతి,కూతురు ధనలక్ష్మికి వెంకటేశ్వర్లు ద్వారా కష్టాలు మొదలయ్యాయి.తోడబుట్టిన చెల్లికి వివాహం చేసిన అన్న వెంకటేశ్వర్లు గ్రామంలోని సర్వే నెంబర్ 437 లో తన తండ్రికి చెందిన భూమిలో ఎకరం భూమిని కట్నంగా ఇచ్చాడు.
కానీ,సవతి తల్లికి పుట్టిన చెల్లికి మాత్రం వివాహ సమయంలో అదే సర్వే నెంబర్లో 9 గుంటల భూమి మాత్రమే పసుపు కుంకుమ కింద ఇస్తానని అగ్రిమెంట్ రాసిచ్చాడు.అందులోనే 2 గుంతలు తన భూమిలో కలుపుకొని,7 గుంటలే ఇస్తానని చెప్పాడు.
అయినా అంగీకరించిన చెల్లెలు ఆ 7 గుంటల భూమిని అన్న వెంకటేశ్వర్లుకే కౌలుకు ఇచ్చింది.కొంత కాలం వరకు కౌలు చెల్లించిన అన్న ఉన్నట్టుండి కౌలు ఇవ్వడం మానేశాడు.
అనుమానం వచ్చిన చెల్లెలు ధనలక్ష్మి తన భూమి తన పేరుమీద చేయమని అడగగా,ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి,సవతి తల్లి,చెల్లి మరణించినట్లు సర్టిఫికెట్స్ సృష్టించి,భూమి మొత్తం తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు.ధనలక్ష్మి పెళ్లి సమయంలో పసుపు కుంకుమ క్రింద పెట్టిన స్థలం అన్న కొదాటి వెంకటేశ్వర్లు కబ్జా చేసి,వారిని వేధిస్తూ 8 ఏళ్ళ నుండి వారిని కోలుకోకుండా చేశాడు.
అప్పటి నుండి ధనలక్ష్మి,తల్లి పుష్పావతి స్థానిక తహశీల్దార్,రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగి తిరిగి అలసిపోయారు.ఎక్కడా న్యాయం జరగకపోవడంతో చివరికి కోర్టులో కేసు వేశారు.
ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండగా కోదాటి వెంకటేశ్వర్లు కబ్జా చేసిన ధనలక్ష్మి భూమిని సామినేని రమేష మరియు మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తోంది.కొనుగోలు చేసిన వారు అందులో గోడ నిర్మాణం చేయడంతో ఆ విషయం తెలుసుకున్న ధనలక్ష్మి,తల్లి పుష్పావతి వెంకటేశ్వర్లును ఇదేంటని అడగగా,తల్లి,చెల్లెలు అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడి,మీ దిక్కున్నచోట చెప్పుకోండి గుంట భూమి కూడా ఇచ్చేది లేదని బెదిరిస్తూ, ఎక్కువ మాట్లాడితే పెట్రోలు పోసి తగలపెడతానని,మీరు ఎన్ని రోజులకైనా నా చేతుల్లో చచ్చే వాళ్లేనని భయబ్రాంతులకు గురి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు మహిళలు తమ భూమిని కొనుగోలు చేసిన వారి వద్దకు వెళ్లి కోర్టులో ఉన్న భూమిని కొనుగోలు చెయ్యొద్దని చెప్పగా,సదరు విక్రయదారులైన రమేష్ అండ్ కో ఆడపిల్ల భూమి తమకు అవసరం లేదని,మీ భూమిలో నిర్మాణం చేసిన గోడను కూల్చమని చెప్పడంతో,మహిళా సంఘాల సహకారంతో ఒంటరి మహిళలు భూమిపైకి వెళ్లడంతో కథ అడ్డం తిప్పారు.
తిరిగి అదే రమేష్ వారిపై,మహిళా సంఘాల నేతలపై అక్రమంగా కేసు పెట్టి,వారిని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళల్ని,మహిళా సంఘాల నేతలను స్థానిక ఎస్ఐ క్రాంతి కుమార్ మహిళలని కూడా చూడకుండా వేళ్ళు చూపుతూ అసభ్యంగా మాట్లాడుతూ,కోర్టులో పెండింగులో ఉన్న సివిల్ కేసులో తలదూర్చి,మీకేం హక్కుందని భూమిపైకి వెళ్లారని ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఇచ్చిన స్థలం ఇవ్వకుండా కబ్జా చేసి 8 సంవత్సరాల నుండి సవతి తల్లి కొదాటి పుష్పావతి చెల్లి నర్రా ధనలక్ష్మిలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న కోదాటి వెంకటేశ్వర్లును కాపాడుతున్న దెవరనే ప్రశ ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.కబ్జాకు పాల్పడిన కొదాటి వెంకటేశ్వర్లు స్థానికంగా టీఆర్ఎస్ పార్టీలో చోటా నాయకుడు కావడంతో,అధికార పార్టీలో కీలక నేతలైన సామినేని రమేష్,నరేష్ ల అండతో ఈ అరాచకానికి తెరలేపాడని బాధితులు తల్లి,బిడ్డ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాధితురాలు ధనలక్ష్మికి వివాహ సమయంలో ఇచ్చిన 9 గుంటల భూమి తెస్తేనే కాపురం చేస్తానని ధనలక్ష్మి భర్త ఆమెను,ఇద్దరు పిల్లలను వదిలేసి పోవడంతో ప్రస్తుతం ఆమె తమ్మర గ్రామంలో తల్లి దగ్గర అద్దెకు ఇల్లు తీసుకొని జీవిస్తుంది.తల్లిని కూడా సవతి కొడుకు పట్టించుకోక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె చెప్పింది.
ఆడపిల్లకు ఇచ్చిన భూమిని కబ్జా చేయడమే కాకుండా వారిని చంపుతానని బెదిరిస్తున్న కోదాటి వెంకటేశ్వర్లుకు అధికార పార్టీ నేతలు,పోలీసులు కొమ్ము కాయడం విస్మయానికి గురి చేస్తుందని ఈ విషయం తెలిసిన వారు వాపోతున్నారు.