భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి రెండో ఘాట్ రోడ్డులొని లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో ఛైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియలోని మిగిలిన సగ భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.భక్తుల భద్రత ముఖ్యమని.
ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని శ్రీ సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు.
డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమల లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు.వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమల కు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.