సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎలాంటి అభివృద్ధి చేయకుండా తన్నుకు చావండని వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్ అన్నారు.తిరుమలగిరి మండలం మొండిచింత తండా గ్రామపంచాయతీ మరియు దాని పరిధిలో ఉన్న మూడు తండాల్లో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉందని తెలుసుకున్న ఆయన మొండిచింత తండా, రూప్లా తండా,బండమీది తండా భూక్య తండాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తండాల నుండి నియోజకవర్గ మరియు మండల కేంద్రానికి వెళ్లేందుకు కూడా రహదారి లేక తండాల ప్రజలు తల్లడిల్లుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ తండాలు పుట్టి సుమారుగా 60 ఏళ్లు అవుతున్నా నేటి వరకు పట్టించుకోలేదని,తెలంగాణ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసి,
అభివృద్ధిని విస్మరించాయని ఆరోపించారు.
ఈ తండాల నుండి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదని, రోడ్డు సౌకర్యం లేక కనీసం ఆటో సౌకర్యం కూడా సరిగా లేదని,ప్రైవేట్ పాఠశాల బస్సులను పంపడానికి సిద్ధంగా లేరని,దీనితో చేసేదేమీలేక విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల హాస్టల్స్ లో నెలకు 60 నుండి 70 వేల రూపాయలు ఫీజులు చెల్లించి చదివిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.వర్షాలు వచ్చినప్పుడు ఈ తండావాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని,బంగారు తెలంగాణలో వీరి బతుకులు మారేదెన్నడని ప్రశ్నించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ తండాల్లో నూతన రోడ్ల నిర్మాణం కోసం నిధులు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ధరావత్ వెంకన్న,ధరావత్ శంకర్,రమేష్,వాలి,లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.