సూర్యాపేట జిల్లా:జిల్లాలోని ఐకెపి కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోల్లను వేగవంతం చేసి,డబ్బులను వెంటనే ఆలస్యం లేకుండా రైతులు అకౌంట్లలో జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు ఎంవిఎన్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
ఇంకా కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని,కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చోట ధాన్యం కొనుగోలు నత్త నడకన కొనసాగుతుందన్నారు.గ్రామాలలోని ఐకెపి కేంద్రంలో ధాన్యం కొనుగోలు సరిగా చేయకపోవడం మూలంగా రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ధాన్యాన్ని తెస్తే ఖరీదు దారులు,కమిషన్ దారులు, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఒకపక్క నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో రైతాంగం ఇబ్బందులు పడుతూ పంటలు పండిస్తే పండించిన పంటను మార్కెట్లోకి అమ్మడానికి తీసుకు వస్తే మద్దతు ధర ఇచ్చే దగ్గర మధ్య దళారీలు రైతులను మోసం చేస్తున్నారన్నారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులు మద్దతు ధర ఇవ్వడం లేదని పలుమార్లు ఆందోళనలు చేసినా మార్కెటింగ్ అధికారులు,జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
గ్రామాల్లో ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసినట్లయితే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేవి కాదన్నారు.రాబోయే ఖరీఫ్ సీజన్ లోనైనా రైతాంగానికి ప్రభుత్వం మేలు రకమైన విత్తనాలను సబ్సిడీ ద్వారా సరఫరా చేయాలని,నకిలీ విత్తనాలు మార్కెట్లో రాకుండా ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
వెంటనే జిల్లా అధికారులు ఐకెపి కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోల్లను వేగవంతం చేయాలని,డబ్బులను రైతులు అకౌంట్లో ఆలస్యం లేకుండా వెంటనే జమ చేయాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి,వేల్పుల వెంకన్న,మేకనబోయిన శేఖర్,వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.