సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో అధికార పార్టీ నేతల ధన దాహానికి అధికారుల అలసత్వం తోడై రెండు నిండు పసి ప్రాణాలు గాల్లో కలిసిన ఘటన గ్రామంలో విషాదం నింపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
రెడ్లకుంట గ్రామంలో గత కొంత కాలంగా స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా యధేచ్చగా సాగుతుంది.మట్టికోసం పెద్ద పెద్ద గుంతలు తవ్వి వాటిని పూడ్చకుండా వదిలేయడంతో ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ గుంతలు పూర్తిగా నిండాయి.
బుధవారం పశువుల వద్దకు వెళ్లిన గ్రామానికి చెందిన ఉపేందర్(12),వినయ్ (11) ప్రమాదవశాత్తు ఆ గుంతల్లో పడి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లడుతూ అధికార పార్టీ స్థానిక నేతల కన్నుసన్నల్లోనే మట్టి మాఫియా జోరుగా సాగుతుందని,మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని వాపోయారు.
మట్టి మాఫియాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం అలసత్వం వహించడంతో ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి ధనార్జనకు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోవడం మమ్ముల్ని కలచివేస్తుందన్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలని అరికట్టాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని గ్రామంలో ధర్నాకు దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.