సూర్యాపేట జిల్లా: గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడు జిల్లాలో విషజ్వరాల తీవ్రత బాగా పెరిగిందని,ఇప్పటికే 69 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.డెంగ్యూ వల్ల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని,మీ పరిసర ప్రాంతాలు,ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని,నీటి నిలువ లేకుండా జాగ్రత్త పడుతూ ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
దీనికి కారణం మున్సిపల్, పంచాయితీ కేంద్రాల్లో చెత్త సేకరణ చేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడం, బ్లీచింగ్ లాంటి పదార్థాలను చల్లకపోడంతో పారిశుద్ధ్యం పడకేసి, దోమలు, ఈగలు పెరిగి విషజ్వరాలకు కారణభూతాలుగా మారాయని అంటున్నారు.
మున్సిపల్ కేంద్రాలలో మ్యాన్ పవర్ లేకపోవడం, పంచాయితీ సిబ్బంది సమ్మె ప్రభావం కూడా దీనికి కారణమని తెలుస్తోంది.
దీనితో గ్రామీణ,పట్టణప్రాంతాలకు చెందిన ప్రజలు విషజ్వరాల బారినపడి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి క్యూ కడుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన అసౌకర్యాలు లేక ప్రైవేట్ హాస్పిటల్స్ వెళితే వేలల్లో ఖర్చు చేయవలసి వస్తుందని రోగులు వాపోతున్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిపై జిల్లా వైద్య అధికారి డాక్టర్ హర్షవర్ధన్ వివరణ కోరగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు నేటికీ 69 కేసులు నమోదు అయ్యాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని వాళ్ళు లేకుండా చూసుకోవాలని ఒక్కసారి డెంగ్యూ వస్తే ప్రమాదం కాదు గాని,మరోసారి ఖచ్చితంగా ప్రాణాపాయం ఉంటుందన్నారు.
ఇళ్ళల్లో టైర్లల్లో,కొబ్బరి చిప్పల్లో ఇంటి ఆవరణలో చిన్న చిన్న గుంతలలో నీళ్లు నిలవ లేకుండా చూసుకోవాలని సూచించారు.ప్రస్తుతానికి జనరల్ ఆస్పత్రిలో ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.