సూర్యాపేట జిల్లా: రైతులకు 10 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తా, రాజీనామా చేస్తావా అని మంత్రి కేటీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం విసిరిన సవాల్ ను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పందించారు.గురువారం తన రాజీనామా పత్రంతో మునగాల సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని దమ్ముంటే సబ్ స్టేషన్ వద్దకు రావాలని ఎంపీ కోమటిరెడ్డికి( MP Komatireddy ) సవాల్ విసిరడంతో మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దీనితో పోలీసులు భారీగా మోహరించి,భద్రతా చర్యలు చేపట్టారు.ఎమ్మెల్యే సవాలకు ఎంపీ కోమటిరెడ్డి స్పందించక పోవడంతో వందలాది మంది రైతులతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు.అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, మండు వేసవిలో కూడా కోతలు లేకుండా ప్రజలకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యాఖ్యలు అర్థరహితమైనవని, కాంగ్రెస్ నాయకుల మాటలకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని,ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చవాకులు పేలుతున్నారని అన్నారు.రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని,నేడు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని,కాంగ్రెస్ దుకాణం మూసుకోవాలని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు,ప్రజా ప్రతినిధులు,రైతు సమన్వయ సమితి నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,మండల పార్టీ అధ్యక్షులు,పట్టణ కౌన్సిలర్లు,గ్రామ శాఖ అధ్యక్షులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.