సూర్యాపేట జిల్లా:ప్రశాంతమైన పల్లెల్లో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తూ పల్లెల అశాంతికి కారణమవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని భావించిన ప్రజలు ఈ నెల 2న గాంధీ జయంతి సాక్షిగా అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామాల్లో సంపూర్ణ మధ్య నిషేధంపై( Alcohol prohibition ) ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని ఇకపై మా గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేయొద్దని ప్రతిజ్ఞ చేసుకున్న విషయం సూర్యాపేట జిల్లాలో పల్లె చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం( Athmakur (S) mandal ) గట్టికల్లు, పాతర్లపాడు గ్రామాల్లో ఈ ప్రజా చైతన్యం వెల్లివిరిసింది.
గ్రామాల్లో గత కొన్నేళ్లుగా బెల్ట్ మాఫీయా చేసిన వికృత దాడికి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని,నిండు నూరేళ్ళు కుటుంబాలతో సంతోషంగా ఉండాల్సిన యువకులు మద్యానికి బానిసలై బంగారం లాంటి భవిష్యత్ ను నాశనం చేసుకోవడమే కాకుండా చిన్న వయసులోనే భార్య పిల్లలను అనాథలుగా చేస్తున్నారని భావించిన ఆ రెండు గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు వందలాదిమంది కలిసి గాంధీ జయంతి సందర్భంగా గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలని తీర్మానాలు,ప్రతిజ్ఞలు చేసుకున్నారు.గ్రామాల్లో మద్యం బెల్ట్ దుకాణాలు వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించారు.
ఇక నుండి గ్రామాల్లో మద్యం అమ్మడం కానీ,తాగడం కానీ చేయరాదని ప్రతిజ్ఞ చేశారు.మద్యం విక్రయించినా తాగినా భారీ మొత్తంలో జరిమానాలు విధించేటట్లు తీర్మానాలు చేసుకున్నారు.
గట్టికల్ లో జరిగిన మధ్య నిషేధ కార్యక్రమానికి మండల ఎస్సై వై.సైదులు హాజరై గ్రామాల్లో మధ్య నిషేధం చేసుకోవడం చాలా శుభ పరిణామమని,గ్రామాలకు సంతోషకరమైన విషయమని,ప్రతీ గ్రామంలో ప్రజల్లో ఇలాంటి చైతన్యం రావాలని ఆకాంక్షించారు.అలాగే ఈ మద్య నిషేధ ఉద్యమాలు, ర్యాలీలు శాంతియుతంగా చేసుకొని,గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని సూచించారు.కిరాణా షాపులు మరే విధమైన ప్రాంతాల్లో గుట్కా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని,ఈ విషయం యువకులు అందరికీ సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రతి రాజకీయ పార్టీల,కుల సంఘాల,యువజన సంఘాల నుంచి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మాణం చేయడం గ్రామీణ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు,యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనగా,మద్యపాన నిషేధానికి మండల జర్నలిస్టు సంఘం సంపూర్ణ మద్దతు తెలపడం శుభ పరిణామమని గ్రామస్తులు అంటున్నారు.
ఇలాంటి చైతన్యం మిగతా పల్లెల్లో కూడా రావాలని,పల్లెల్లో నుండి మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.