సూర్యాపేట జిల్లా: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్య పడొద్దని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కేంద్రంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తడిసిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల వలన ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచామని,కురుస్తున్న వర్షాల వలన ఎక్కడ కూడా రైతులు తెచ్చిన ధాన్యం తడవకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలని,మిల్లర్లు వెంటనే వాహనాల్లో ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుండి 1,84,485.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని,అలాగే రైతులకు ఇప్పటివరకు రూ.225 కోట్లు చెల్లించామన్నారు.అన్ని కేంద్రాల్లో మండల స్థాయి అధికారులు అలాగే ప్రత్యేక అధికారులు పరిశీలన చేయాలని, ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
కేంద్రాల్లో పాత గోనె సంచుల బదులు కొత్త గొనె సంచులు వాడాలని, అలాగే పాత సంచులు ఉంటే తిరిగి పంపాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్,పిఏసిఎస్ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.