సూర్యాపేట జిల్లా:మోతె మండలం రావిపాడు గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీని(NMK Ethanol Company) రద్దు చేయాలని గత 20 రోజులుగా ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు వివిధ దశలుగా పోరాటాలు చేస్తూ రోజు రోజుకి ఉద్యమం ఉదృతం అవుతున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో పోరాట కమిటీ నాయకులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.దీంతో ఆ కంపెనీ నిర్మాణ ప్రాంగణం మొత్తం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
మునగాల సిఐ నేతృత్వంలో మోతె ఎస్సై సిబ్బంది శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొన్నారు.
దీంతో నాయకులు ఆగ్రహానికి గురై రిలే నిరాహార దీక్షను భగ్నం చేసి అక్రమ అరెస్ట్ చేయడం సరికాదని పోలీసుల తీరుపై మండిపడ్డారు.శాంతియుతంగా ప్లకార్డులతో కంపెనీ ద్వారా జరిగే నష్టాలను ప్రజలకు వివరించడం నేరమా అంటూ కంపెనీ నిర్మాణాన్ని ఆపేంత వరకు ఈ పోరాటం ఆగదని నినదించారు.