సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో అకాల వర్షాలకు అంకిరెడ్డి పున్నమ్మకు చెందిన వరి పొలం నేలకొరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్ వరి పంట పొలాన్ని పరిశీలించి మాట్లాడుతూ అకాల వర్షాలతో మండలంలో పలుచోట్ల వరి పంట పొలాలు నేలకొరిగాయన్నారు.
వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానలతో రైతులకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లిందన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయి బాధలో ఉన్న రైతులకు ఏ ఒక్క మంత్రి భరోసా ఇవ్వలేదన్నారు.నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించి,వెంటనే ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పిన్నపరెడ్డి మల్లారెడ్డి,జీలకర రామస్వామి,రైతులు నూకల సత్యనారాయణ రెడ్డి,అంకిరెడ్డి సోమయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.