సూర్యాపేట జిల్లా:వానాకాలం ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సంబంధిత శాఖా అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో వానాకాలం పంట 2022-23 పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.
మోహన్ రావుతో కలసి పాల్గొన్నారు.ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి వ్యవసాయ శాఖ పంట డేటా ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించి,పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఐకేపీ,పిఏసిఎస్ ద్వారా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జిల్లా మార్కెటింగ్ శాఖ ద్వారా సంబంధిత పరికరములు అందుబాటులో ఉంచాలన్నారు.రైతులు తమ పరిధిలోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు తప్పక బ్యాంక్ ఖాతా ఉండాలని,కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు జరగాలని అలాగే రైతులకు ధాన్యం డబ్బులు సత్వరమే జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.ఇతర ప్రాంతాల నుండి ధాన్యం జిల్లాలోకి రాకుండా జిల్లా సరిహద్దులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులులలో గట్టి నిఘా ఉంచామని ఆదిశగా పొలీస్,రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
మిల్లర్లు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దని, లేనియెడల కఠినంగా వ్యవహరిస్తామని,అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు పాల్పడితే అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.జిల్లాలో 8 సెక్టర్లుగా విభజించామని,దాదాపు 320 పైగా లారీలు ఏర్పాటు చేశామని, లారీలను మాత్రమే వినియోగించాలన్నారు.
అన్ని కేంద్రాలలో తప్పక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేంద్రం వివరాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.గన్ని సంచులు 70 లక్షలు ఉండగా మరో కోటి యాభై లక్షల సంచులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
అన్ని కేంద్రాలలో నిరంతరం విద్యుత్ ఉండేలా చూడాలని,ప్రతి చోట ఎలెక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఉంచాలన్నారు.జిల్లాలో ఉన్న జాతీయ రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆర బెట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం వానాకాలం పంట కొనుగోలు గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఏఓ రామారావు నాయక్, డిఎం రాంపతి నాయక్,జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్,డిసిఓ శ్రీనివాస్,డిఎస్ఓ పుల్లయ్య,ఐకేపీ,పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.