సూర్యాపేట జిల్లా: డిజే సౌండ్ సిస్టమ్,ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనం చేస్తున్న 4 గురు అంత రాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ జి.రవి తెలిపారు.
శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు.జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని,దీనిలో భాగంగా శనివారం ఉదయం జాతీయ రహదారి 65 పై సూర్యాపేట పట్టణ పరిధిలోని జనగాం క్రాస్ రోడ్డు వద్ద పట్టణ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సౌండ్ సిస్టం కు సంబంధించిన ఎలక్రానిక్ పరికరాలను గుర్తించి, వాహనంలో ఉన్న నల్గొండ జిల్లా అడివిదేవులపల్లి మండలానికి చెందిన కుర్ర తుల్చాను విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
కేసు నమోదు చేసి తుల్చాను విచారించగా కోదాడకు చెందిన దరావత్ బాలకృష్ణ,బర్మావత్ గురు చరణ్,నల్గొండ జిల్లాకు చెందిన రమావత్ వంశీ లతో కలిసి దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడని, నిందితుల నుండి రూ.25 లక్షల విలువగల సౌండ్ సిస్టమ్స్ కు సంబంధించిన 27 ఎలక్ట్రానిక్ పరికరాలు,7 ఆంప్లిఫయర్లు,7 క్రాస్ ఓవర్స్,6 మిక్సర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.A-1 నిందితుడు కుర్ర తుల్చాపై గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం కేసు, A-2 బాలకృష్ణ,A-3 గురుచరణ్ లపై గతంలో కోదాడ టౌన్ పిఎస్ లో గంజాయి కేసులు ఉన్నాయని,ముద్దాయిలకు గత నేర చరిత్ర ఉన్నదన్నారు.
నిందితుడు కుర్ర తుల్చా హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవిస్తూ వచ్చే డబ్బులు సరిపోక తన స్నేహితులైన కోదాడకు చెందిన బాలక్రిష్ణ @ సిద్దు, గురుచరణ్ @ గురులతో కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి పూట ఫంక్షన్ హాల్ లలో,డీజే షాప్ ల ముందు ఉంచిన డీజే సౌండ్ సిస్టమ్ లను ఎలాగైనా దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామనుకోని,పథకం వేసుకొని దిల్ షుక్ నగర్ లో గల లాంగ్ డ్రైవ్ కార్స్ లలో కార్ లను కిరాయికి తీసుకోని అక్కడి నుండి బయలుదేరి గత సంవత్సరం నవంబర్ నెల నుండి మాచర్ల,సూర్యాపేట, కోదాడ,చిలుకూరు,చివ్వెంల ఏరియాలలో రాత్రి పూట సంచరిస్తూ ఫంక్షన్ హాల్ లలో, డీజే షాప్ ల ముందు ప్రోగ్రామ్ చేసి వచ్చాక పార్కింగ్ చేసిన వాహనాలలో నుండి ఆంప్లిఫయర్లు,మిక్సర్లు,క్రాస్ ఓవర్స్ లను దొంగిలించి వాటిని ఒక దగ్గర దాచి పెట్టి,
వీలు కుదిరినప్పుడు వేరే ప్రాంతాలకి తీసుకోని వెళ్ళి అమ్ముదామని ఈ రోజు ఒక వాహనాన్ని కిరాయికి తీసుకోని వాటిలో దొంగిలించిన డీజే సౌండ్ సిస్టమ్ వస్తువులను తరలిస్తుండగా జనగాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డట్లు వివరించారు.
మాచర్ల,సూర్యాపేట,కోదాడ, చిలుకూరు,చివ్వెంలలో చేసిన దొంగతనాలు ఒప్పుకోగా పంచనామా జరిపి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.ఈ కేసులో బాగా పని చేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి.రాజశేఖర్,ఎస్ఐలు ఎస్.కె.యాకూబ్,పి.లోకేష్,బాలక్రిష్ణ, మరియు క్రైమ్ సిబ్బంది కరుణాకర్,కృష్ణ,సైదులు, ఆనంద్,మధు మరియు ఐ.టి సెల్ సుధాకర్,రవిలను ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారని జరిగినదని తెలిపారు.కేసులను ఛేదించిన సిబ్బందికి ఎస్పీ రివార్డ్స్ ప్రకటించారన్నరు.