సూర్యాపేట జిల్లా:గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ( Congress party ) స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన స్థానిక సంస్థలను కూడా ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
కానీ,ఇప్పడు పరిస్థితి మారింది.రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడంతో స్థానిక నేతలు కోల్పోయిన స్థానిక సంస్థలను తమ హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు ఎన్నికల సమయంలో హస్తం గూటికి చేరగా,ప్రస్తుతం మరికొందరు సొంత పార్టీపై అసమ్మతితో కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వచ్చిన నేపథ్యంలో కోదాడ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది.కాంగ్రెస్ పార్టీ కోదాడను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటుంది.
కోదాడ మున్సిపల్ చైర్మన్, కోదాడ ఎంపీపీ,కోదాడ పిఎసిఎస్ చైర్మన్, నడిగూడెం పిఎసిఎస్ చైర్మన్,చిమిర్యాల సొసైటీ చైర్మన్ పదవులపై కాంగ్రెస్ కన్నేసింది.ఈ క్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్( Municipal Chairman ) పై అవిశ్వాసం ఏర్పాటు చేయాలని సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.
కోదాడ మున్సిపల్ పరిధిలో 35 మంది కౌన్సిలర్లకు ఒక కౌన్సిలర్ మరణించగా 34 మంది ఉన్నారు.ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పై 27 మంది అవిశ్వాసానికి సిద్ధమై తీర్మానంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కి అందజేశారు.
కోదాడ మండల పరిషత్ లో 11మంది ఎంపిటిసిల్లో ఇద్దరు ఎంపీటీసీలు మరణించగా 9 మంది ఉన్నారు.ఇందులో ప్రస్తుత ఎంపిపిపై 8 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
కోదాడ,నడిగూడెం,చిమిర్యాల పిఎసిఎస్ లలో అదే సీన్ కనిపిస్తుంది.కోదాడ పీఏసీఎస్ లో 13మంది డైరెక్టర్లు ఉండగా 8 మంది చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండగా,నడిగూడెంలో 9 మంది డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోరుతూ సూర్యాపేట డిసిఓకు అవిశ్వాస తీర్మానపత్రం సమర్పించగా,చిమిర్యాల సొసైటీలో 13 మందికి 9 మంది సొసైటీ చైర్మన్( Society Chairman ) పై అవిశ్వాసం పెట్టేందుకు సూర్యాపేట జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీధర్ ను కలిసి అవిశ్వాస తీర్మాన కాపీని అందజేశారు.
దీనితో కోదాడ నియోజకవర్గ పరిధిలో కుర్చీల ఆట షురూ అయిందని,స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.