సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అగమ్యగోచరంగా తయారైంది.ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హరితహారం అభాసుపాలవుతున్న తీరు గ్రామీణ ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.
పాలకవీడు మండలంలోని గుండెబోయినగూడెం పంచాయతీ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు పొలాల్లో నిప్పు పెట్టడంతో హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.అధికారుల అవగాహన కల్పించక పోవడంతో రైతులు తమ పొలాలకి నిప్పు పెట్టడం వలన పొలాలలో సారవంతం పోయి,పంట దిగుబడి తగ్గి,రైతుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అదేవిధంగా ప్రతి గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా హరితహారం మొక్కలు ఉండడంతో అవి అగ్నికి ఆహుతి అవుతున్నాయి.ప్రకృతి అంటేనే పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉం డాలి.
కానీ,గ్రామంలో పచ్చదనం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.ప్రభుత్వం ప్రకృతి వనాలకి,హరితహారం మొక్కలకి కేటాయిస్తున్న నిధులు ఎక్కడ బోతున్నాయో మొక్కల పర్యవేక్షణ చూస్తుంటే ఇట్టే అర్థమవుతుంది.
ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాల్లో వనాలు పెంచి ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదాన్ని పెంచి,పంచడం కోసం చర్యలు చేపడుతుంటే స్థానిక అధికారులు వాటిని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడవడంతో ప్రజాధనం వృధా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పచ్చదనంతో నిండిపోయి చూడ ముచ్చటగా ఉండాల్సిన రోడ్లు వెలవెలబోతూ ఉండటాన్ని తప్పుపడుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న పనులను పర్యవేక్షణ జరిపి,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.