సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు.
బుధవారం మునగాల మండల కేంద్రంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి అయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు.
చట్టం స్ఫూర్తికే విరుద్ధంగా నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా ఇస్తుందని చెప్పారు.
పేదలకు మాత్రం 60 గజాల ఇంటి జాగా ఇవ్వడానికి మాత్రం చేతులు రావడంలేదని చెప్పారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్లు ఇండ్లు కట్టి పేదలకు ఇస్తామని చెప్పిన బీజేపీ, 8 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు.
వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం,గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తొక్కి పట్టిందని మండిపడ్డారు.దేశవ్యాప్తంగా పోడు,సాగు దారులుగా ఉన్న ఆదివాసి గిరిజనులకు గిరిజనయేతర పేదలకు భూమిపై హక్కు పత్రాలు ఇవ్వకుండా కార్పొరేట్ బహుళ కంపెనీలకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో అడవులు పెంచడం పేరుతో విలువైన అటవీ భూములు ఇతర సంపదను కట్ట పెట్టాలని చూస్తుందని ఆరోపించారు.
నిత్యవసర వస్తువుల ధరలు,నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతుందని వీటిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.పెరిగిన ధరల కనుగుణంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల కనీస వేతనాల జీవోలను సవరించి వేతనాలను పెంచడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి హామీ నిధులను గత సంవత్సరం కేటాయించిన లక్ష కోట్ల నుండి 60 వేలకోట్లకు బడ్జెట్ కుదించిందని, ఆధార్ కార్డు,జాబ్ కార్డు, బ్యాంక్ ఎకౌంటు ఆన్లైన్ అనుసంధానం పేరుతో కోట్లాదిమంది పేదల పనిని తగ్గించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరల కనుగుణంగా రోజు కూలి 600 రూపాయలకు ఉపాధి పనిని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంత పేదలు 55 వేల గుడిసెలను వేలాది ఎకరాల్లో వేసుకుని నివాసం ఉంటున్నారని, వీరందరికీ జీవో నెంబర్ 58 59 ప్రకారం రెగ్యులర్ చేసి పట్టాలు ఇవ్వాలని,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు సాగుదారులకు నాలుగు లక్షల మందికి హక్కు పట్టాలు సిద్ధం చేశామని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో ఒక్కరి కూడా హక్కు పట్టా ఇవ్వలేదని అన్నారు.
తక్షణమే సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేకపోతే పేదలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, వెలిది పద్మావతి,జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీను,పఠాన్ మహబూబ్ అలీ,నారసాని వెంకటేశ్వర్లు,సోమపంగు జానయ్య,కడెం కుమార్, జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర రామ్ చరణ్, బుడిగ ధనుంజయ్ గౌడ్, షేక్ సైదా,హుస్సేన్, నాయకులు లింగయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.