సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం ప్రాథమికోన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యా శాఖాధికారి అశోక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల మౌళిక సదుపాయాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని,లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు విద్యను కొనాల్సిన అవసరం లేకుండా,ఉన్న ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలలు ఆన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు.బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించాలని సూచించారు.
ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్న భోజనం,యూనిఫామ్,రంగుల పాఠ్యపుస్తకాలు,డిజిటల్ విద్యాబోధన,ఆరోగ్య పరీక్షలు వంటివి అందిస్తుందన్నారు.మన ఊరు మన బడి పథకం ద్వారా పాఠశాలల మౌలిక వసతులను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయిలో వాటిని తీర్చిదిద్దుతుందన్నారు.
సమావేశానంతరం తొలి అడ్మిషన్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా చేశారు.అనంతరం బడిబాట ర్యాలీని ఎమ్మెల్యే జండా ఊపి ప్రారంభించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మక విద్యను ఆంగ్లమాధ్యమంలో సైతం అందిస్తున్నామని,తల్లిదండ్రులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి,సర్పంచ్ నంద్యాల విజయలక్ష్మి, మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అజయ్ కుమార్, తొగరు రమేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ రెడ్డి,ఎస్ఎంసి చైర్మన్ సరిత,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,ఎస్ఎంసి సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.