సూర్యాపేట జిల్లా: ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.యాదగిరిరావు పిలుపునిచ్చారు.
బుధవారం పాలకవీడు మండల కేంద్రంలో జరిగిన అంగన్వాడి టీచర్ల సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరైన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక,ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరిట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలో విలీనం చేసి,ఐసీడిఎస్ ఉద్దేశ్యాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం 2018 లో పెంచిన అంగన్వాడి వేతనం పదిహేను వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.కొంతమంది పదో తరగతి వరకే చదిన వారున్నారని,ఫోన్ అప్డేట్ చేయక ఇబ్బంది పడుతున్నారని,దీనివల్ల రికార్డును రాయడంతో పాటు,స్మార్ట్ ఫోన్ లో అప్లోడ్ చేయడం పనిభారం పెంచడమేనని అన్నారు.
వెంటనే స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ నెల 28, 29 న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు.
ఈ సమ్మెలో అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు,వివిధ రంగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కందగట్ల ప్రకాష్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇరుకు సైదులు,అంగన్వాడీ టీచర్లు ఎస్.ప్రేమలత, డి.జానకమ్మ,కళమ్మ, వసుంధర, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.