సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం ఒక మంచి లక్ష్యం,ఉద్దేశ్యంతో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పిడిఎస్ బియ్యం అందిస్తుందని,ఇవి లబ్ధిదారులకు చేరాలని, వీటి పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డా, అక్రమ మార్గంలో అమ్మకాలకు నిర్వహించినా,రీసైక్లింగ్ చేసినా అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని,పిడి చట్టం సైతం నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అక్రమ రవాణాను క్షేత్ర స్థాయిలో అరికట్టడానికి సంభందిత అధికారుల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.వ్యవస్థ బియ్యం అందించే మిల్లర్లపై,అంతరాష్ట్ర ట్రాన్స్పోర్ట్ పై పోలీస్ నిఘా ఉన్నదన్నారు.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ రేషన్ డీలర్లు,మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని (పిడిఎస్ రైస్) లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్ నందు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నదని, దీనిపై రేషన్ డీలర్లు, మిల్లర్లపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామన్నారు.
అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని,స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.సమాచార వనరులు బలోపేతం చేయబడ్డాయని, అంతరాష్ట్ర బార్డర్ పరిసర ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టామని,ఇక్కడ అక్రమ వ్యాపారం,అక్రమ రవాణా జరగకుండా నిర్ములించడంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
అక్రమ వ్యాపారాలు,అసాంఘిక చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజల నుండి ఫిర్యాదులు, సమాచారం వస్తుందన్నారు.పోలీసు సిబ్బంది సమాచారాన్ని సేకరించాలని,వ్యాపారం చేసేవారు ఎలాంటి వారు ఉన్నా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని,అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన,ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే పిడి యాక్ట్ చట్టం నమోదు చేస్తామని హెచ్చరించారు
.